Funding for GHMC in 2023 budget: రూ.1850కోట్ల అంచనాతో ఐదేళ్లపాటు నగరంలోని 812కి.మీ రోడ్లను మెరుగ్గా నిర్వహించాలని జీహెచ్ఎంసీ మూడేళ్ల క్రితం సీఆర్ఎంపీ(రహదారుల సమగ్ర నిర్వహణ కార్యక్రమం)ని పట్టాలెక్కించింది. ఇప్పటి వరకు రూ.950కోట్లు వెచ్చించింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రెండో దశలో మరో 800కి.మీ రోడ్లను సీఆర్ఎంపీ పరిధిలోకి తేవాలని జీహెచ్ఎంసీ ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించింది. మొదటి దశ పనుల పూర్తికి, రెండో దశ ప్రాజెక్టు వ్యయానికి రూ.500కోట్లు కేటాయించాలని జీహెచ్ఎంసీ సర్కారును కోరింది.
రెండేళ్ల క్రితం వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని(ఎస్ఎన్డీపీ) ప్రారంభమైంది. ఆ పనులకు బల్దియా రూ.650కోట్ల బ్యాంకు రుణం తీసుకుంది. రెండో దశకు రూ.2,400కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోమారు బ్యాంకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదని నాలాలకు రూ.300కోట్లు ఇవ్వాల్సిందిగా అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. రూ.30వేల కోట్ల అంచనాతో ఏడేళ్ల క్రితం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని(ఎస్సార్డీపీ) ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారు రూ.5వేల కోట్ల పనులు జరిగాయి.
మూసీపై వంతెనలు: పురోగతిలో ఉన్న రూ.3వేల కోట్ల పనులు, రెండో దశ ఎస్సార్డీపీ పనులను పట్టాలెక్కించేందుకు జీహెచ్ఎంసీ సర్కారును రూ.500కోట్ల సాయం కోరింది. లింకు రోడ్ల పనులు ప్రస్తుతం వేర్వేరు దశల్లో ఉండగా, వాటిని వేగవంతం చేసేందుకు రూ.200కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. మూసీపై వంతెనలు, రెండు పడక గదులు, పార్కులు, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకూ కేటాయింపులు జరపాలని అధికారులు అంచనా వ్యయాలను సర్కారును నివేదించారు. ఉద్యోగులు, సిబ్బందికి నెలవారీ జీతాల చెల్లింపు, విశ్రాంత ఉద్యోగులకు నగదు ప్రయోజనాల అందజేతకు నానా అవస్థలు పడుతున్న బల్దియాకు ఆర్థిక భరోసా ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
మెట్రో రెండోదశపై కేంద్రానికి వినతి:కేంద్ర బడ్జెట్లో ఈసారి హైదరాబాద్ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై భారీ ఆశలు ఉన్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం దక్కుతుందనే అంచనాలున్నాయి. హైదరాబాద్‌కు సంబంధించి మెట్రోరైలు రెండోదశకు రూ.8,453 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మొదటిదశలో మిగిలిన సర్దుబాటు వ్యయ నిధి రూ.252 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించింది.
యూపీఏ హయాంలో ప్రకటించిన ఐటీఐఆర్‌ను ఇవ్వాలని కోరింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. మెట్రోరైలు రెండో దశలో మూడు మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఒక మార్గం రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ. మార్గం నిర్మాణానికి అయ్యే రూ.6,250 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించి శంకుస్థాపన కూడా చేసింది.
మిగిలిన రెండు మార్గాలకు నిధులివ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. బీహెచ్ఈఎల్ నుంచి కొండాపూర్ మీదుగా లక్డీకాపూల్ వరకు 26 కి.మీ., నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కి.మీ. మార్గం.. మొత్తం 31 కి.మీ.కు రూ.8,453 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌తో సహా ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది.