agriculture sector in the annual budget 2023-24 in TS: తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రూ.2,90,396కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. అందులో వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో ఏకంగా రూ.26,831 కోట్లను.. వ్యవసాయానికి కేటాయించారు. సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... ‘సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశా నిర్దేశనం చేస్తోంది. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారని'' పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పాటుకు ముందు పదేళ్ల వ్యవసాయం, వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.7,994 కోట్ల నిధులు ఖర్చు చేయగా, రాష్ట్రం ఆవిర్భవించినప్పటినుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం 1 లక్షా 91 వేల 612 కోట్ల రూపాయలు, అంటే 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చు చేసిందని మంత్రి సభలో వివరించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తారణాధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితుల ఏర్పాటు చేశారన్నారు.