తెలంగాణ

telangana

ETV Bharat / state

అవినీతికి అడ్డాగా హైదరాబాద్​ క్రికెట్​ అసోషియేషన్​..! - హైదరాబాద్​ వార్తలు

దేశానికి యువ క్రీడాకారులను అందించాల్సిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. పేరుకే క్రికెట్‌ అసోషియేషన్‌ అయినా... ఏనాడు క్రికెట్‌ అభివృద్ధికి పాటుపడింది లేదంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షులు మారుతున్నా హెచ్​సీఏ తలరాత మారడం లేదంటూ క్రీడా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలకే పరిమితమైందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అవినీతికి అడ్డాగా హైదరాబాద్​ క్రికెట్​ అసోషియేషన్​..!
అవినీతికి అడ్డాగా హైదరాబాద్​ క్రికెట్​ అసోషియేషన్​..!

By

Published : Feb 25, 2021, 5:23 AM IST

అవినీతికి అడ్డాగా హైదరాబాద్​ క్రికెట్​ అసోషియేషన్​..!

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌.... హైదరాబాద్‌ కరప్షన్‌ అసోషియేషన్‌గా మారిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్​సీఏ కొత్తగా క్రికెటర్లను ఎలాగో తయారు చేయడం లేదని... కనీసం ఉన్నవాళ్లను కాపాడుకోలేకపోతోందని క్రీడా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హెచ్​సీఏ తీరుతో విసుగెత్తి అంబటి రాయుడు ఆంధ్రా క్రికెట్‌ అసోషియేషన్‌కి.. మరో ప్లేయర్‌ బావనాక సందీప్‌ గోవా క్రికెట్ అసోషియేషన్‌కి వెళ్లారని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన మహ్మద్‌ సిరాజ్‌ను సైతం పట్టించుకోలేదనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. భారత జట్టు మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ లాంటి గొప్ప ఆటగాడు అధ్యక్షుడిగా ఉన్నా.. హెచ్​సీఏ తీరు మారకపోవడంపై క్రికెట్‌ లోకం అసహనం వ్యక్తం చేస్తోంది.

వైఫల్యాలకు అవే కారణం

క్రికెటర్‌ అవ్వాలని... భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ఎంతోమంది క్రీడాకారులు కలలు కంటారు. ప్రతిభ ఉన్నవారిని కాకుండా కాసులు వెదజల్లే వాళ్లనే ఎంపిక చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2019-2020 రంజీ సీజన్‌, ఈ ఏడాది జరిగిన ముస్తాక్‌ అలీ టోర్నీల్లో లీగ్‌ దశలోనే హైదరాబాద్‌ ఇంటిముఖం పట్టిందని.. హెచ్​సీఏ జట్టు చివరిగా ఆడిన ఐదు రంజీ మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనే నెగ్గిందని.. నైపుణ్యం లేని క్రీడాకారులను ఎంపిక చేసిందనడానికి ఈ వైఫల్యాలే ఉదాహరణగా పలువురు క్రీడాకారులు చెబుతున్నారు. క్రీడాకారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు.

జిల్లాల వైపు కన్నెత్తి చూడడం లేదు..

హెచ్​సీఏ పేరుకు తగ్గట్టే హైదరాబాద్‌కే పరిమితమైందని.. జిల్లాలవైపు కన్నెత్తి చూడటం లేదనే అపవాదును మూటగట్టుకుంటుంది. గత నెల ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆడిన జట్టులోగానీ... తాజాగా విజయ్‌ హజారేకు ఎంపిక చేసిన జట్టులో జిల్లాల నుంచి ఒక్క ఆటగాడు కూడా లేడని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని క్లబ్‌లు, నగర పరిసరాల్లోని అకాడమీలకు చెందిన క్రికెటర్లనే ఎంపిక చేశారని ఆరోపిస్తున్నారు.

ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలి..

గత సీజన్లలో నిలకడగా రాణించిన కె. సుమంత్‌, అభిరథ్‌ రెడ్డి, రోహిత్‌ రాయుడు, అనిరుథ్‌ రెడ్డి, జునైద్‌ అలీ, వరుణ్‌ గౌడ్‌ లాంటి ఆటగాళ్లను పక్కనపెట్టి పైరవీల ద్వారా వచ్చినవారిని విజయ్‌ హజారే టోర్నీకి ఎంపిక చేశారని విమర్శిస్తున్నారు. ప్రతిభ ఆధారంగా యువ క్రికెటర్లను ఎంపిక చేయాలని తల్లిదండ్రులు, క్రీడాభిమానులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:గడువులోగా పార్టీ సభ్యత్వం పూర్తి చేయాలి : హరీశ్ ​రావు

ABOUT THE AUTHOR

...view details