రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఆయన ప్రారంభించారు. రాష్ట్రాల హక్కులను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. భాజపా చేస్తున్న కుట్రలను తిప్పకొట్టాలని విద్యార్థి నేతలకు సూచించారు.
హుజూరాబాద్ వరకు బస్సు యాత్ర...
భాజపా విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ బస్సు యాత్రను ప్రారంభించింది. గన్‌పార్కు నుంచి హుజురాబాద్ వరకు ఈ యాత్ర చేపట్టినట్లు విద్యార్థి నేతలు తెలిపారు. ఈటల స్వార్థ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని విద్యార్థి నేతలు ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఉన్న ఇతర పార్టీ నేతలను చేర్చుకుని బలోపేతం కావాలన్నదే భాజపా ఎత్తుగడన్నారు. తెరాస పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్న విద్యార్థి నేతలు... ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల రాజేందర్ భాజపాలో చేరారని విమర్శించారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్థిత్వాన్ని చెరిపేసేందుకు దిల్లీ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా చేస్తున్న కుట్రలను బహిర్గతం చేసేందుకే విద్యార్థి జేఏసీ బస్సు యాత్రను చేపట్టిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థి జేఏసీ పాత్ర కీలకం. ఉస్మానియా కేంద్రంగా సాగిన ఉద్యమం ఓ చరిత్ర. రాష్ట్రాల హక్కులను భాజపా ప్రభుత్వం కాలరాస్తోంది. మోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చాక యూపీతో సహా భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. మైనార్టీలను అణచివేత జరుగుతోంది. రిజర్వేషన్ల ప్రాధాన్యతను కేంద్రం తగ్గించింది. ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చింది కేంద్రమే. తెలంగాణపై కనీస అవగాహన లేకుండా భాజపా నేతలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా విషయంలో భాజపా నేతలు ఏనాడు ప్రశ్నించలేదు. ఇవాళ నీటిపై కేంద్రం గెజిట్ విడుదల చేసి మనపై పెత్తనం చెలాయించేందుకు యత్నిస్తోంది. రాష్ట్ర సహకారశాఖను కూడా రాష్ట్రాల జాబితాలో లేకుండా చేస్తోంది. దేశంలో ఇంధన ధరలు పెంచి సామాన్య ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతులు ఇప్పటి కూడా దిల్లీ సరిహద్దులో రైతులు పోరాడుతున్నారు. రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించేందుకు పలు రకాలుగా కుట్రలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్నకుట్రలను తిప్పి కొట్టేందుకు ఇలాంటి ఉద్యమం జరగాలని కోరుకుంటున్నా.
- అల్లం నారాయణ, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్
' కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం'