తెలంగాణ

telangana

ETV Bharat / state

మీరు ఆంక్షల వలయంలో చిక్కుకున్నారా.. ఐతే ఇలా ఎదిరించి బయటపడండి..! - ఏపీ తాజా వార్తలు

Do like this When Problems Occurs : ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లాకు చెందిన ఓ న్యాయవాది తన భార్యను దాదాపు 13 ఏళ్లు ఇంటి నుంచి బయటికి రాకుండా చేశాడు. ఇంగ్లీష్ లిటరేచర్​లో ఆమె ఎమ్​ఏ చేశారు. ఉన్నత చదువులు చదివినా.. ఆమె ఏనాడూ అతడ్ని ఎదురించే ప్రయత్నం చేయలేదు. ఇలాంటి ఆంక్షల వలయంలో మీరూ చిక్కుకుంటే ఇలా చేసి బయటపడండి.

Women Safety matters, Womens Rights
Face the Problems by Doing this

By

Published : Mar 2, 2023, 10:16 PM IST

Do like this When Problems Occurs : ఏపీలోని విజయనగరం పట్టణానికి చెందిన మధుబాబు.. తన భార్యను దాదాపు పదమూడేళ్ల నుంచి బయటి ప్రపంచానికి దూరంగా ఉంచాడు. ఎంతలా అంటే.. తనకు ఇద్దరు పిల్లలు పుట్టిన విషయం కూడా తన ఇంటివారికి తెలియనివ్వనంతగా. ఇది విన్న తర్వాత కంప్యూటర్ యుగంలోనూ ఇలాంటి ఆటవిక మనుషులున్నారా అనే ఆశ్చర్యం కలగక మానదు. ఇది బయటపడ్డ ఉదంతం మాత్రమే. ఈ బాహ్య ప్రపంచానికి తెలియనివి ఎన్నో జరుగుతున్నాయి. మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇలా చేయండి..

ఫిర్యాదు చేయండి : భర్త, అత్తవారింటి నుంచి వేధింపులు ఎదురైనప్పుడు మొదటగా పుట్టినింటి వారికి చెప్పండి. అవసరమైతే పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించి సమస్య పరిష్కారం అయ్యేలా చూడండి. అప్పటికీ అవ్వకపోతే పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయండి. ఇది మీ ఒక్కరి వల్ల కాకుంటే.. కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయం తీసుకోండి.

మహిళల చట్టాలపై అవగాహన పెంచుకోండి : ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతున్న మహిళల కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి. తమను వెంబడించినా, దూషించినా, అడ్డుకున్నా, వేధింపులకు గురి చేసినా.. ఐపీసీ పలు సెక్షన్ల కింద శిక్షార్హులని తెలుసుకోండి. ఇలాంటి వాటిపై అవగాహన పెంచుకోండి. దీనికోసం మీకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వాడుకోండి. సెల్ ఫోన్, ఇంటర్ నెట్, పుస్తకాలు, మీకు తెలిసిన లాయర్ల ద్వారా వీటి గురించి తెలుసుకోండి.

ఇతరుల గురించి ఆలోచించకండి :ఇలాంటి సమయాల్లో కుటుంబ సభ్యులు, పరువు ప్రతిష్ఠ, ఇతరులు, సమాజం ఏం అనుకుంటుందోనని అలాగే చూస్తూ ఉండకండి. అలాగే మిగిలిపోతే.. చివరికి మిగిలేది ఏమీ ఉండదు. కాబట్టి మీరు విద్యార్హతల ఆధారంగా మీకు వచ్చిన ఉద్యోగం చేయండి. జీతం ఎంతైనా సరే. ఇతరులపై ఆధారపడకుండా ఉంటే చాలు. ఒకవేళ మీకు పిల్లలున్నా.. వారు మీతో రావడానికి అంగీకారం తెలిపితే.. నిర్భయంగా మీతో తీసుకెళ్లండి. వారిని ఎలా పోషించాలి అని బాధపడకండి. పక్షుల లాంటివి వాటి పిల్లల కోసం ఎక్కడెక్కడి నుంచో ఆహారాన్ని తెచ్చి పోషిస్తాయి. మీరు అంతకంటే సమర్థులు అన్న విషయం మర్చిపోకండి. పైగా పిల్లల కోసమైనా.. ఇంకా శ్రద్ధగా, బాధ్యతతో పనిచేస్తాం.

మీ కాళ్లపై మీరు నిలబడే ప్రయత్నం చేయండి : ఒకవేళ మీకు చదువు లేకపోతే.. మీకు మిషన్ కుట్టడం, కుట్లు, అల్లికలు వస్తే.. దగ్గరలో ఉన్న బొటిక్​లల్లో పని చేయండి. అది కూడా రాకుంటే.. బట్టల షాపులోనైనా పనికి కుదరండి. వచ్చే సొమ్ము ఎంతైనా.. కష్టపడి సంపాదిస్తాం కాబట్టి నామోషీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు సొంతంగా బతికే క్రమంలో.. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వొచ్చేమో కానీ.. తర్వాతి కాలంలో కచ్చితంగా నిలదొక్కుకుంటారు. క్రమంగా అన్నీ వాటికవే సర్దుకుంటాయి. మీ దగ్గర అనుకున్నంత డబ్బులు లేకున్నా.. మానసిక ప్రశాంతత, స్వేచ్ఛ దొరుకుతుంది. దీన్ని ఎంత పెట్టినా కొనుగోలు చేయలేం అన్న విషయం మర్చిపోకండి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details