మహా నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నువ్వా.. నేనా అన్నట్లు జరుగుతోన్న పోరులో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది ఈ రోజే. సోమవారం రాత్రికే పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ పెట్టెలు, ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. నేటి (మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటు వేసేందుకు ఓటర్లను అనుమతిస్తారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు అధికారులు పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటుచేశారు. నాలుగో వంతు కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ జరగనుంది.
- నగరంలోనే మొదటిసారి డివిజన్‌కు ఓ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల ముఖాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నారు.
- కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అన్ని కేంద్రాలను యంత్రాంగం క్రిమి సంహారక ద్రావణంతో శుద్ధి చేసింది.
- మాస్కు ధరించిన ఓటర్లనే అనుమతిస్తామని స్పష్టం చేసింది.
కొవిడ్ బాధితులకు ప్రత్యేక వరుస
కొవిడ్ బాధితులకు ఇప్పటికే తపాలా ఓటు వేసే అవకాశం కల్పించారు. దీనికి దరఖాస్తు చేసుకోనివారికి ప్రత్యేక క్యూ కేటాయించి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని జీహెచ్‌ఎంసీ తెలిపింది.
పోలింగ్ సందర్భంగా నేడు సెలవు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం 1974, 1988 ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని పరిశ్రమలు, ఉద్యోగులు, కార్మికులందరికీ వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని తెలిపింది. ఓటింగ్ రోజు సెలవు ప్రకటించని సంస్థలు, యజమానులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ శ్యామ్‌సుందర్ జాజు ఒక ప్రకటనలో తెలిపారు.