కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవ్వడాన్ని నిరసిస్తూ... అఖిలపక్షం ఆధ్వర్యంలో వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి, తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, చెరుకు సుధాకర్, ఆర్.కృష్ణయ్య, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని ఎండగట్టారు.
ఆర్థిక సంక్షోభం...
కరోనా వల్ల వలస, అసంఘటిత కార్మికులు, చేతి వృత్తుల వాళ్లు ఆర్థిక సంక్షోభానికి గురయ్యారని అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. ప్రజలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నవంబర్ వరకు ప్రతి కుటుంబానికి రూ.7,500 నగదుతో పాటు ఉచిత రేషన్ ఇవ్వాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
శ్వేతపత్రం విడుదల చేయండి..
సీఎం సహాయ నిధికి వచ్చిన నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల పోరాటాలపై ప్రభుత్వం నిర్బంధాలను విడనాడాలని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
ప్రతిరోజూ ఒక అంశం..
రాష్ట్ర ప్రభుత్వం ముందుంచిన డిమాండ్ల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. జులై 28 నుంచి ఆగస్టు 4 వరకు ప్రతిరోజు ఒక అంశంపై సెమినార్ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. జులై 28న కరోనాపై ప్రభుత్వ నిర్లక్ష్యం- న్యాయ పోరాటం, 29న అసంఘటిత రంగం, వలస కూలీల జీవనంపై కొవిడ్ ప్రభావం, 30న కొరవడుతున్న ప్రజారోగ్యం, 31న విద్యారంగంపై కొవిడ్ ప్రభావం, ఆగస్టు 1న కొవిడ్ బాధలు- సహాయక చర్యలు, 3న ఉద్ధీపన పథకాల డొల్లతనం, 4న కొవిడ్ ప్రజా ఆందోళనపై ప్రభుత్వ నిర్బంధం అంశాలపై రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 7గంటల వరకు వెబినార్/ సెమినార్లు నిర్వహిస్తామని ప్రకటించారు.
నల్లజెండాలతో..
జులై 30న అన్ని కలెక్టరేట్ల వద్ద నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ.. వినతిపత్రాలు ఇవ్వాలని అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఆగస్టు 2న వర్చువల్ రచ్చబండ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 5న మహా నిరసనకు పిలుపునిచ్చారు. మహా నిరసనలో భాగంగా సచివాలయం, ప్రగతి భవన్ వద్ద నల్ల బెలూన్లు, నల్ల జెండాలు ఎగరవేయాలని నిర్ణయించారు.
రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి బహిరంగ సభలో పాల్గొనేందుకు కృషి చేయాలని అఖిలపక్షం పిలుపునిచ్చింది.