హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల నేతల సమావేశమయ్యారు. కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేత సంపత్ కుమార్, తెదేపా నేత సాయిబాబా, తెజస అధ్యక్షులు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలు, మద్యం దుకాణాలు తెరవడం, రైతుల దాన్యం కొనుగోలు, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చేయూతనిచ్చే అంశాలపై సమావేశంలో చర్చించారు.
జీవో నెంబర్ 3 పై త్వరలోనే అఖిలపక్షం ఆధ్వర్యంలో గవర్నర్ను కలుస్తామని నేతలు వెల్లడించారు. జీవో నంబర్ 3 ఏజెన్సీ ఏరియాల్లో మాత్రమే... మైదాన ప్రాంతాల్లో ఉన్న వారికి సంబంధం లేదన్న విషయం సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించలేకపోయిందని.. అందుకే జీవోను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న ఆదివాసీ , గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఏజెన్సీ ఏరియాల్లో విద్య , వైద్యం , మౌలిక సదుపాయాల కోసం జీవో నెంబర్ 3 తీసుకొచ్చారన్నారు. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 కొట్టేసాక తెలంగాణ, ఏపీ ప్రభుత్వం సమన్వయంతో రివ్యూ పిటిషన్ వేసేలా చూడాలన్నారు. లేదా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 పై ఆర్డినెన్స్ తీసుకురావాలని నేతలు కోరారు.
"జీవో నెంబర్ 3ను సీరియస్గా తీసుకొని ఏజేన్సీల్లో ఆదివాసీల విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు తోడ్పడాలి. ఎక్కడా విఘాతం కలగకుండా ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టాలి."
-పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
"బతికి ఉంటే బలిసాకు తినొచ్చని కేసీఆర్ చెప్పారు. నిజమే కానీ బతికే పరిస్థితి లేదిప్పుడు. లాక్డౌన్ మూలంగా బతుకు భారమైంది. వలస కూలీలు, కార్మికులు దినదినగండంగా జీవిస్తున్నారు."