తెలంగాణ

telangana

ETV Bharat / state

Bharath Bandh: భారత్‌ బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలి: అఖిలపక్ష నేతలు

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 27న జరగనున్న భారత్‌ బంద్‌(Bharat bandh) సహకరించాలని అఖిలపక్ష నేతలు (all party meeting) రాష్ట్ర ప్రజలను కోరారు. హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లో సమావేశమైన అఖిలపక్ష పార్టీల నేతలు భారత్‌ బంద్‌ విజయవంతం చేసే అంశంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. భారత్‌ బంద్‌కు ప్రజలంతా సహాకరించాలని విజ్ఞప్తి చేశారు.

all party meeting
అఖిలపక్ష నేతలు

By

Published : Sep 24, 2021, 8:03 PM IST

Updated : Sep 24, 2021, 9:09 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న చేపట్టిన భారత్‌ బంద్‌ను (Bharat bandh) విజయవంతం చేయాలని అఖిలపక్ష పార్టీలు(all party meeting) పిలుపునిచ్చారు. వాణిజ్య, వ్యాపార సంస్థలు భారత్‌ బంద్‌కు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లో సమావేశమైన అఖిలపక్ష పార్టీల నేతలు భారత్‌ బంద్‌ అంశంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.

అఖిలపక్ష నేతలు

మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. దేశంలో మతోన్మాద దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెగసస్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతల రహస్యాలు తెలుసుకుంటోందని మండిపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌,డీజిల్‌, గ్యాస్​పై పన్నులు తగ్గించాలని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కార్మిక చట్టాలను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో నెలకొన్న ఇబ్బందులను తొలగించడంతో పాటు పోడు రైతుల భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయన్నారు.

అఖిలపక్ష పార్టీలు చేపట్టిన భారత్‌ బంద్‌లో తెదేపా సంపూర్ణంగా పాల్గొంటుందని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని.. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు.

కరోనాతో చనిపోయిన కుటుంబాలకు సహాయం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27న చేపట్టిన భారత్‌ బంద్‌కు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోజు ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాల్సిందే. కరోనాను అరికట్టడంలో కేంద్రం విఫలమైంది. వ్యాక్సిన్ పంపిణీలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అణచివేత చర్యలు, దేశద్రోహ చట్టం, ఉపా చట్టం తెచ్చి ప్రతిపక్షాలను బంధించడం జరుగుతోంది. స్పైవేర్ తీసుకొచ్చి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు.- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

పెట్రోల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక పన్నులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన ధరలపై పన్నులు తగ్గించాలి. అప్పుడే నిత్యావసర ధరలు కూడా అదుపులోకి వస్తాయి. ధరణి పోర్టల్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలపై పోరాడేందుకు 27న బంద్‌ చేస్తున్నాం- మల్లు రవి, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు

కేంద్రం ప్రజల హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారు. కార్పొరేట్‌కు ప్రజల సొమ్మును అప్పగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకే ఈనెల 27 న బంద్ నిర్వహిస్తున్నాం- చాడ వెంకట్‌ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలి. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలి. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణను చేసే ఆలోచనను విరమించుకోవాలి.

- రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది. నిత్యావసర ధరలు పెరిగాయి. ఇంధన ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ భారత్‌ బంద్‌ చేస్తున్నాం. అన్ని పార్టీలు కలిసి ఈ బంద్‌లో పాల్గొంటున్నాం.

-ఆచార్య కోదండరాం, తెజస అధ్యక్షుడు

ఇదీ చూడండి:Revanth Reddy : అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నాం : రేవంత్​

Last Updated : Sep 24, 2021, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details