ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో హైదరాబాద్లో నేడు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వీహెచ్, కుసుమ కుమార్, తెదేపా నేతలు రమణ, రావుల, తెజస అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్రెడ్డి పాల్గొన్నారు. ప్రజాగాయకుడు గద్దర్తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.
ప్రతిపక్షాలుంటే ప్రభుత్వ అక్రమాలు బయటపడుతున్నాయనే దురుద్దేశంతోనే... ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యులను కేసీఆర్ ఆకర్షిస్తున్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. ప్రజాధనాన్ని ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి... శాసనసభ్యులను పార్టీలో చేర్చుకోవడానికే ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఫిరాయింపులను కేసీఆర్ కంటే కేటీఆర్ మరింత ప్రోత్సహిస్తున్నారని తెతెదేపా నేత రావుల మండిపడ్డారు.