కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన తరుణంలో.. సచివాలయం కూల్చివేతపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెజస కార్యాలయంలో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం' - ఉచిత కరోనా పరీక్షలు చేయాలన్న కోదండరామ్
నాంపల్లి తెజస కార్యాలయంలో అఖిలపక్ష నాయకులు కోదండరామ్, ఎల్.రమణ, చాడ వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో విస్తృతంగా ఉచిత కరోనా పరీక్షలు చేయాలని కోదండరామ్ సూచించారు. ప్రతి కుటుంబానికి 6 నెలలు రూ.7,500, ఉచిత రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణ ఉద్ధృతం చేస్తామని ఎల్.రమణ అన్నారు.
'డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం'
తొలగించిన ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లను పరిష్కరిస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి హామీ ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 17 నుంచి ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి :అమీన్పూర్ ఘటనపై హైపవర్ కమిటీ ఏర్పాటు