తెలంగాణ

telangana

ETV Bharat / state

HUZURABAD ELECTIONS: హుజూరాబాద్‌లో మొదలైన ప్రచారహోరు

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఎప్పుడనేది ఇంకా తెలియకపోయినా ఇప్పుడు అక్కడ ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే బలగాలను మోహరించాయి. ఊరూరా ఎన్నికల ప్రచారం సాగుతోంది. సభలు, సమావేశాలను నిర్వహిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా భేటీలు మొదలయ్యాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, మంతనాలు సాగుతున్నాయి. వాడీవేడి విమర్శలతో ఒకరిపై మరొకరు నిప్పులు చెరుగుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు దద్దరిల్లుతున్నాయి.

HUZURABAD ELECTIONS: హుజూరాబాద్‌లో మొదలైన ప్రచారహోరు
HUZURABAD ELECTIONS: హుజూరాబాద్‌లో మొదలైన ప్రచారహోరు

By

Published : Jul 4, 2021, 5:31 AM IST

కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల పరిధిలో ఉన్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఎప్పుడనేది ఇంకా తెలియకపోయినా ఇప్పుడు అక్కడ ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే బలగాలను మోహరించాయి. ఊరూరా ఎన్నికల ప్రచారం సాగుతోంది. సభలు, సమావేశాలను నిర్వహిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా భేటీలు మొదలయ్యాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, మంతనాలు సాగుతున్నాయి. వాడీవేడి విమర్శలతో ఒకరిపై మరొకరు నిప్పులు చెరుగుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు దద్దరిల్లుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఆరు దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్‌ తెరాస పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రిమండలి నుంచి బర్తరఫ్‌ చేసిన వెంటనే ఆయన నియోజకవర్గంలో పర్యటించి, తన రాజీనామాపై సంకేతాలిచ్చారు. మద్దతుదారులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. భాజపాలో చేరిన తర్వాత ఈటల భార్య జమునతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ వివేక్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరులు కూడా పాలుపంచుకుంటున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి విడిగా పర్యటిస్తున్నారు.

గులాబీ పక్కా వ్యూహం

ఈటల వైఖరిపై కొన్ని నెలలుగా అనుమానంతో ఉన్న తెరాస అధిష్ఠానం.. ఆయనను బర్తరఫ్‌ చేసిన వెంటనే ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని వ్యూహరచన చేసింది. మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విప్‌ బాల్క సుమన్‌లు నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డిలు పర్యటించి వెళ్తున్నారు. మరోవైపు మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లు వ్యూహాన్ని అమలుచేస్తున్నారు.వీరందరి సమక్షంలో కరీంనగర్‌లో, హైదరాబాద్‌లో, స్థానికంగా ఈటల మద్దతుదారుల చేరికలు జరుగుతున్నాయి. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మండలాలు, పురపాలికలకు బాధ్యులుగా నియమించింది.

కాంగ్రెస్‌లో సందడి

కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి, ఇతర నేతలు ఆ పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ మూడు పార్టీలు మినహా ఇతర పార్టీలకు అక్కడ ఉనికి లేదు. తెదేపా ప్రభావం అంతగా లేదు.
బరువు బాధ్యతలు
నియోజకవర్గంలో హుజూరాబాద్‌ గ్రామీణ, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్‌, జమ్మికుంట గ్రామీణ మండలాలతో పాటు హుజూరాబాద్‌, జమ్మికుంట పురపాలికలున్నాయి. ఈ మండలాలకు తెరాస, భాజపాలు ఇన్‌ఛార్జులను నియమించాయి. కాంగ్రెస్‌ గత ఎన్నికలప్పుడు ఉన్న వారినే కొనసాగిస్తోంది. మొత్తమ్మీద ఇక్కడ ఎన్నికల ప్రచారం అత్యంత ఖరీదుగా సాగుతోంది. జన సమీకరణ కష్టంగా మారింది. ప్రజాప్రతినిధులకు, నేతలకు వారి వారి పార్టీల నుంచి నిధులు అందుతున్నాయి. కార్యకర్తలకు రోజువారీ భత్యం, భోజనం, వారి వాహనానికి పెట్రోలు ఖర్చులను పార్టీలే భరిస్తున్నాయి.

ప్రచారంలో ఢీ అంటే ఢీ

ఎన్నికల ప్రచారంలో ఈటల, తెరాస నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. లేఖలు విడుదలవుతున్నాయి. దానిపై ఫిర్యాదులుచేస్తున్నారు. రాజేందర్‌ మంత్రిగా తనకు అవమానం జరిగిందని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బీసీ వాదం వినిపిస్తున్నారు. తనను గెలిపించి, ఆత్మగౌరవాన్ని చాటాలని కోరుతున్నారు. తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తున్నారు. తనను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ సాయంతో ముందుకెళతామంటున్నారు. ఎమ్మెల్యేలు కొన్నిచోట్ల ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందజేస్తుంటే ఈటల అనుచరులు అడ్డుకున్నారు. మరోవైపు తెరాస.. ఈటలది స్వయంకృతాపరాధమంటూ ప్రచారం చేస్తోంది. పార్టీకి ద్రోహం చేశారని, భాజపాతో కుమ్మక్కై కుట్ర చేశారని ప్రజలకు వివరిస్తోంది. ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేశారని, నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, ఎవరినీ ఎదగనీయలేదని తెలియజేస్తోంది. హుజూరాబాద్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు, ఆసరా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ వంటి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను తెరాస నేతలు విడుదల చేస్తున్నారు. ఈటల భాజపాలో చేరినందున ఆయన గెలిచినా లాభం లేదని చెబుతున్నారు. పార్టీ మరో రెండేళ్లు అధికారంలో ఉంటుందని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం తెరాసతో సాధ్యమని వివరిస్తున్నారు. కాంగ్రెస్‌.. ఈటల వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. తెరాస, ఈటల కంటే కాంగ్రెసే మేలని చెబుతోంది. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఒకరు ప్రచారానికి దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.

గతమేమి చెబుతోందంటే...

తెరాస ఆవిర్భావం నుంచి హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం పార్టీకి కంచుకోట. 2004 నుంచి ఈటల విజయం సాధిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తెరాసకు 59.34శాతం ఓట్లు రాగా... కాంగ్రెస్‌కు 34.60శాతం వచ్చాయి. భాజపా 1,683 (0.95శాతం)ఓట్లతో నోటా, స్వతంత్ర అభ్యర్థితర్వాతి స్థానంలో నిలిచింది. ఈటల 47,803 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈటల కంటే అధికంగా తెరాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ 76,865 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ 46,504, భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ 26,149 ఓట్లు పొందారు. తమ ఓట్లు తమకే వస్తాయని తెరాస; తన ఓట్లకు భాజపా ఓట్లు కలుస్తాయని ఈటల ఆశాభావంతో ఉన్నారు.

అభ్యర్థులెవరో

ఇప్పటి వరకు భాజపా అభ్యర్థి ఈటల అనేది స్పష్టమైంది. తెరాస, కాంగ్రెస్‌ల నుంచి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. తెరాస తరఫున రోజుకో పేరు బయటకు వస్తోంది. మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ పేరు ప్రచారంలో ఉన్నా స్పష్టత రాలేదు. స్థానిక సమీకరణాల దృష్ట్యా బీసీ లేదా ఓసీలలో ఒకరికి అవకాశం వస్తుంది. పలువురు నేతలు, అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి ముఖ్యనేతలు అభ్యర్థులుగా రావాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన కౌశిక్‌రెడ్డి రంగంలోఉన్నా...మరికొందరు ప్రయత్నిస్తున్నారు.

ఎవరి ఓట్లు ఎన్నంటే..

  • మొత్తం ఓటర్లు-2.26లక్షలు
  • బీసీలు-1.30లక్షలు
  • ఎస్సీలు-46వేలు
  • ఓసీలు-34వేలు
  • మైనారిటీలు-14వేలు
  • ఎస్టీలు-2వేలు

ఇదీ చదవండి: REVANTH REDDY: 'భాజపా, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఏజెంట్‌​'

ABOUT THE AUTHOR

...view details