తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుగుబాటు అభ్యర్థుల్ని బుజ్జగిస్తున్న పార్టీలు

పురపాలక ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం జోరుగా సాగుతోంది. ఉపసంహరణకు 14 వరకూ గడువు ఉన్నందున తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా చూసుకునేందుకు పార్టీ నేతలు తంటాలు పడుతున్నారు. వారిని సముదాయించే బాధ్యతను స్థానిక నేతలకే అప్పగించారు.

తిరుగుబాటు అభ్యర్థుల్ని బుజ్జగిస్తున్న పార్టీలు
తిరుగుబాటు అభ్యర్థుల్ని బుజ్జగిస్తున్న పార్టీలు

By

Published : Jan 12, 2020, 5:37 AM IST

Updated : Jan 12, 2020, 6:04 AM IST


పురపాలక ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం జోరుగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు మూడు రోజుల గడువే ఉండటం వల్ల ఆశావహుల్ని బుజ్జగిస్తున్నారు. రాష్ట్రంలో 120 పురపాలక సంఘాల్లో 2,727 వార్డులు, పది నగరపాలక సంస్థల్లోని 385 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 30,800కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. సగటున ప్రతి వార్డుకు పదిమందికి పైగా నామ పత్రాలు దాఖలు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా తెరాస తరఫున దాఖలయ్యాయి. తర్వాత స్థానంలో కాంగ్రెస్‌, భాజపాలున్నాయి.

ఉపసంహరణకు 14 వరకూ గడువు ఉన్నందున తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా చూసుకునేందుకు పార్టీ నేతలు తంటాలు పడుతున్నారు. వారిని సముదాయించే బాధ్యతను స్థానిక నేతలకే అప్పగించారు. వారు బుజ్జగింపు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తిరుగుబాటు అభ్యర్థులతో ఓట్లు చీలి పార్టీ అభ్యర్థులకు నష్టం కలగకుండా చూడటంపై దృష్టిసారించారు. పార్టీ అధిష్ఠానం ప్రధానంగా తెరాస పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకే పూర్తి బాధ్యత అప్పగించింది. ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి తిరుగుబాటు అభ్యర్థులతో మాట్లాడుతున్నారు. పార్టీల్లో వర్గాలున్నచోట పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. కొన్ని చోట్ల ఫార్వర్డ్‌బ్లాక్‌ సహా వివిధ పార్టీల తరఫున బరిలో ఉన్నారు. నామినేషన్లు ఉపసంహరణకు ముందు వరకూ కూడా బీ ఫారాలిచ్చే అవకాశం ఉన్నందున ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.

రేపు ఎన్నికల సంఘం దృశ్య సమీక్ష..

పురపాలక ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ ఏర్పాట్లు, ఉద్యోగులకు ఎన్నికల విధుల అప్పగింత, ఎన్నికల నియమావళి అమలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, ఎన్నికల వ్యయ పరిశీలన తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి సమీక్షిస్తారు.

తిరస్కరణలు తక్కువే:

ఈ సారి నామినేషన్ల తిరస్కరణలు తక్కువగానే ఉన్నాయి. నామినేషన్ల కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలు చక్కగా ఉపయోగపడినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. నామినేషన్‌ పత్రాలను సహాయకేంద్రాల్లో ఉద్యోగులు ముందుగానే పరిశీలించడం వల్ల ఇది సాధ్యమైందని ఎన్నికల సంఘం అధికారులు అభిప్రాయపడ్డారు.

మరో ఇద్దరు తెరాస సభ్యులు ఏకగ్రీవం

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెరాస తరఫున బరిలో ఉన్న నలుగురి ఏకగ్రీవం లాంఛనమే. తాజాగా వనపర్తి పురపాలికలో ఐదో వార్డు పోటీలో తెరాసకు చెందిన శాంతమ్మ ఒక్కరే మిగిలారు. ఆమె ఏకగ్రీవమైనట్లు ప్రకటించడమే తరువాయి. ఇక్కడ నామినేషన్ల పరిశీలనలో ఒకరికి 21 ఏళ్ల కంటే వయస్సు తక్కువగా ఉందని రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. మరో ఇద్దరు ఉపసంహరించుకోవడం వల్ల శాంతమ్మ నామినేషన్‌ మాత్రమే మిగిలింది. ఈ నెల 14న అధికారికంగా ప్రకటించనున్నారు. శనివారం రాత్రి మంత్రి నిరంజన్‌రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పురపాలక సంఘం ఎన్నికల్లో నాలుగో వార్డు బరిలో తెరాస అభ్యర్థి రుక్మిణి ఒక్కరే మిగిలారు. ఈ వార్డు నుంచి మొత్తం ముగ్గురు నామినేషన్లు వేశారు. ఇద్దరు ఉపసంహరించుకోవడం వల్ల రుక్మిణి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఉపసంహరణ అనంతరం ఏకగ్రీవాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇవీ చూడండి:వింటే నామినేటెడ్ పదవులు.. లేకుంటే వేటే!

Last Updated : Jan 12, 2020, 6:04 AM IST

ABOUT THE AUTHOR

...view details