వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు పంద్రాగస్టును ఘనంగా నిర్వహించాయి. తమ కార్యాలయాల్లో శ్రేణులతో కలిసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తూ.... ప్రజలకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేతలు గుర్తుచేసుకున్నారు..
భాజపా కార్యాలయంలో..
భాజపా రాష్ట్ర కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 75ఏళ్ల స్వాంతంత్ర్య భారతావని అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని స్పష్టం చేశారు..
తెలంగాణ భవన్‌లో..
తెరాస రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం బాగా పెరిగిందన్న కేకే..... తెలంగాణలో మరో కొత్త ఉద్యమం వచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో 'దళితబంధు' తీసుకువచ్చారని... ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నట్లు చెప్పారు.
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో..
హిమాయత్ నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు.