దసరా ఉత్సవాలకు మాదాపుర్ శిల్పారామం ముస్తాబవుతోంది. గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుజరాత్ చేనేత - హస్తకళ ప్రదర్శనను ప్రారంభించారు. దసరా పండుగను పురస్కరించుకొని ఈరోజు నుంచి అక్టోబర్ 20వరకు ఆల్ ఇండియా శారీ మేళాను(All india saree mela in hyderabad) నిర్వహించనున్నారు. పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులకు అవసరమైన ధర్మవరం, పోచంపల్లి, గుజరాత్, కచ్‌కు చెందిన చీరలు అందుబాటులో ఉండనున్నాయి.
అండగా ఉండాలి
కరోనా కారణంగా చేనేత కార్మికులు భారీగా నష్టపోయారని శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్ రావు అన్నారు. సందర్శకులు చేనేత కార్మికులకు అండగా ఉండాలని కోరారు. గుజరాత్ చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులు... ఆ రాష్ట్ర సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా ఉన్నాయని తెలిపారు. గుజరాత్ హస్తకళా ఉత్సవ్‌లో కచ్ ఎంబ్రాయిడరీ, అద్దాలతో చేసిన వస్త్రాలు, పటోళ్ల చీరలు, బనారస్ బాందిని చీరలు మహిళలను ఆకట్టుకుంటాయని అన్నారు. చేనేత కళాకారులు తయారు చేసిన ధర్మవరం, పోచంపల్లి, వెంకటగిరి, కళంకారీ వంటి చీరలను ఆల్ ఇండియా శారీ మేళాలో ప్రదర్శించినట్లు(All india saree mela in hyderabad) పేర్కొన్నారు.