గంగపుత్ర జాతిని జాతీయ స్థాయిలో ఏకీకరణ చేయడానికి అఖిల భారత గంగపుత్ర మహాసభ ఉద్భవించిందని సంస్థ అధ్యక్షుడు తౌడబోయిన సత్యం బెస్త వెల్లడించారు. తెలంగాణ , ఏపీ , కర్ణాటక , మహారాష్ట్ర , తమిళనాడు , ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బెస్త కులస్తులు గణనీయంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బెస్త తెగ అత్యధిక సంఖ్యలో ఉందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని సత్యం ఆందోళన వ్యక్తం చేశారు.
ఉనికి, అస్థిత్వం కోసం..
తెలంగాణలో సంప్రదాయ మత్స్యకారులైన తమ ఉనికిని, అస్తిత్వాన్ని ప్రభుత్వం నీరుగార్చుతోందని అవేదన వ్యక్తం చేశారు. గంగపుత్రుల సొసైటీల్లో ఇతర కులాలకు సభ్యత్వం ఇవ్వడం అంటే తమ కుల అస్తిత్వాన్ని దెబ్బతీయడమే అని పేర్కొన్నారు.
సీఎం జగన్కు కృతజ్ఞతలు..
ఏపీలో వైకాపా సర్కార్ బెస్త కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల సత్యం హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోనూ తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బెస్త, గూండ్ల కులస్తులకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలను సత్యం కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి పూస రాజు గంగపుత్ర డిమాండ్ చేశారు.
కాదంటే ఉద్యమమే..
గంగపుత్రులను నిర్లక్ష్యం చేస్తే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. నామినేటెడ్ ఇంత వరకు జాతీయ స్థాయిలో తమకు వేదిక లేదని.. మహాసభ ఏర్పాటుతో గంగపుత్రులను ఏకం చేసి తమ హక్కులను సాధిస్తామని ఉపాధ్యక్షుడు టీ.వెంకటేశ్వర్లు బెస్త తెలిపారు. తరతరాలుగా మత్స్య వృత్తిలో కొనసాగుతున్న సంప్రదాయ మత్స్యకారులకు అన్యాయం చేయొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీలో ఉన్న గంగపుత్రులకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ప్రత్యేక పథకాలను అందించాలని కేంద్రాన్ని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోనే 40 లక్షల బెస్త కులస్తులు ఉన్నారని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
అక్షరాస్యత పెంచుకోవాలి..
గంగపుత్ర యువత అక్షరాస్యత పెంచుకోవాలని.. ఉన్నత విద్య అభ్యసించాలని మహాసభ తెలంగాణ శాఖ అధ్యక్షడు పాక దైవాధీనం బెస్త ఆకాంక్షించారు. మహిళలు పెద్ద ఎత్తున విద్యావంతులు కావాలని.. మహిళా సాధికారత సాధించాలని ఆయన సూచించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి..
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని.. ఇందుకు కేంద్ర రాష్ట్ర సర్కార్లు సహకరించాలని మహాసభ ఉపాధ్యక్షుడు మాదరబోయిన నర్సయ్య బెస్త స్పష్టం చేశారు. తమ కుల సమ్యస ఎక్కడున్నా వాటి కోసం పోరాటానికి ముందుంటామన్నారు. ఇందుకోసం యువత, విద్యార్థులు అందరూ కలసిరావాలని మరో జాతీయ ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ బెస్త అన్నారు.
కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల కార్యదర్శులు జాతీయ కార్యదర్శి ఎం.రమణ బెస్త, ఏపీ ఉపాాధ్యక్షుడు టి.కిష్ణమూర్తి బెస్త, వెంకటేష్ బెస్త, పెద్దబోయిన స్వామి బెస్త, మెదక్ జిల్లా కన్వీనర్ గౌటి విరేశ్ గంగపుత్ర, టి.భూమయ్య బెస్త, కే.నర్సిహులు బెస్త, మంగిళిపల్లి శ్రీనివాస్ బెస్త, మంగిళిపల్లి రమేష్ బెస్త, లింగమూర్తి బెస్త తదితరులు పాల్గొన్నారు.
'జాతీయ స్థాయి ఏకీకరణ కోసమే అఖిల భారత గంగపుత్ర మహాసభ' ఇవీ చూడండి: 'రాష్ట్ర ఆడపడుచులందరికీ సీఎం కేసీఆర్ అన్నయ్యారు'