హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్లో వీరనారి చాకలి ఐలమ్మ 35వ వర్థంతి సభను చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తన భూమిని రక్షించేందుకు ఆంధ్ర మహాసభలో చేరిన ఐలమ్మ... పాలకుర్తి గ్రామంలో నిరంకుశ పాలకుడు విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా భీకరంగా పోరాడినట్లు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు గుర్తుచేసుకున్నారు.
ఇప్పటికీ అణచివేత కొనసాగింపు..
నేటికీ తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీనవర్గాలపైన అణచివేత, దోపిడీ కొనసాగుతోందన్నారు దీనికి వ్యతిరేకంగా వృత్తిదారులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.
చేతివృత్తులన్నీ కుదేలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో చేతివృత్తులన్నీ కుదేలైపోయాయని ఎస్పీకే కార్యదర్శి వినయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ఆర్థిక విధానాల పేరుతో యాంత్రీకరణ పెద్ద ఎత్తున వృత్తులోకి వస్తోందన్నారు. కార్పొరేట్ మార్కెట్ మాయాజాలంలో వృత్తులన్నీ దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా అన్ని వృత్తులకు ఆధునిక శిక్షణ ద్వారా వృత్తిదారులకు ఆధునిక పరికరాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.