4 Years Degree Course In Telangana: రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులను ఇక నుంచి నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే (2023-2024) నుంచే డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ మూడేళ్ల కోర్సులో బీఎస్సీ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా విద్యార్థుల్లో సైబర్ సెక్యూరిటీ వంటి వాటి మీద అవగాహన రావడానికి దానిని నాలుగేళ్లకు పెంచే ఆలోచనలో ఉన్నారు.
ఈ బీఎస్సీ నాలుగేళ్ల కోర్సులో కంప్యూటర్ సైన్స్‌ను ఒక సబ్జెక్టులా కాకుండా పూర్తిస్థాయిలో బోధించేలా.. అందుకు తగిన విధంగా సిలబస్‌ను రూపకల్పన చేయనున్నారు. కోర్సులో భవిష్యత్తులో సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించుకునేందుకు.. అలాగే టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ వంటి తదితర అంశాలను బోధిస్తారు.
మూడేళ్లు కోర్సు చేసే వారికి సాధారణ డిగ్రీ.. నాలుగేళ్లు అయితే ఆనర్స్ డిగ్రీ: ఇదే విషయంపై ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులతో యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ వర్చువల్‌గా మాట్లాడారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సుతో పాటు ఇతర విషయాలపై చర్చించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అంటే విద్యార్థుల్లో నిలకడ లోపిస్తుందని.. వారికి చాలా కష్టమవుతుందని, అర్హులైన అధ్యాపకుల కొరతా ఉందన్న అభిప్రాయాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు లేవనెత్తారు. అందుకే తాము కొత్తగా ప్రవేశపెట్టనున్న బీఎస్సీ ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్‌ను మూడేళ్లకే నిర్ణయించామని యూజీసీ ఛైర్మన్‌కు వివరించారు.