తెలంగాణ

telangana

ETV Bharat / state

Lal Darwaza Bonalu: నేడే లాల్‌దర్వాజా బోనాలు.. ఉత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం - తెలంగాణ వార్తలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల(bonalu) ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లోని ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి(Lal Darwaza Bonalu), చారిత్రక అక్కన్న మాదన్న ఆలయాలతోపాటు పలు ప్రాంతాల్లో ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Lal Darwaza Bonalu, bonalu in hyderabad
లాల్ దర్వాజా బోనాలు, హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు

By

Published : Jul 31, 2021, 3:12 PM IST

Updated : Aug 1, 2021, 5:10 AM IST

రేపే లాల్‌దర్వాజా బోనాలు

బోనాల(bonalu in telangana) సంబురాలు పాతబస్తీలోని పలు ఆలయాల్లో ఈరోజు అట్టహాసంగా జరగనున్నాయి. లాల్‌దర్వాజా బోనాలకు సర్వం సిద్ధమైంది. గతేడాది కరోనా వల్ల ఉత్సవాలకు భక్తులు హాజరుకాలేదు. ఈ ఏడాది వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నిర్వాహకులు.. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహినీ మహంకాళి(Lal Darwaza Bonalu) మందిరంతోపాటు అక్కన్న మాదన్న ఆలయం, ఉమ్మడి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

సందడి షురూ

చారిత్రక లాల్‌దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అలయానికి పలువురు మంత్రులతో పాటు... వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా సింహవాహిని మహంకాళిని భక్తులు కొలుస్తారు. ఏటా ఆషాడ మాసంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. ఇప్పటికే పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాలన్నింట్లో సందడి కొనసాగుతోంది.

బెల్లంతో తయారు చేసిన అన్నం అంటే అమ్మవారికి ప్రీతి. కొత్తకుండలో పాయసం వండి... పసుపు, కుంకుమ, వేప ఆకులతో అలంకరిస్తారు. వేప ఆకు వల్ల క్రిమికీటకాలు నశిస్తాయి. అందుకే ఈ బోనాల ఉత్సవాలు జరుపుతాం. అమ్మవారిని శాంతిపరచడానికి శాంతి కల్యాణం అనే తంతును నిర్వహిస్తాం.

-నర్సింహాచారి, అర్చకుడు

ఆలయాల్లో సందడి

లాల్ దర్వాజా సింహవాహినితోపాటు... చందూలాల్ బేలలోని మాతేశ్వరి ఆలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, శాలిబండ, ఉప్పుగూడ, చాంద్రాయణగుట్ట, మీరాలం మండి, గౌలిగూడ తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లోనూ బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. అన్ని ఆలయాలకు మెరుగులు దిద్దడంతోపాటు విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేడుకల సందడి మొదలైంది.

పాతబస్తీలో జరిగే బోనాల ఉత్సవాలకు వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. గతేడాది కరోనా కారణంగా బోనాలు వైభవంగా జరుపుకోలేదు. ఈ సారి ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వ యంత్రాంగానికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.

-విఠల్‌, లాల్‌దర్వాజ మహంకాళి ఆలయం కార్యదర్శి

పటిష్ఠ బందోబస్తు

తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి ప్రారంభం కానుండగా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీ నుంచి లాల్‌దర్వాజ మహంకాళి గుడికి బోనాల ఊరేగింపు ఉంటుంది. బోనాల సందర్భంగా రంగం, పోతురాజు ప్రవేశం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. లాల్‌దర్వాజ అంబారీ ఊరేగింపు దృష్ట్యా వాహనాల మళ్లించనున్నట్లు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. లాల్ దర్వాజ బోనాలకు 8వేల మందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలు జరిగే ఆలయాల వద్ద పోలీసు అధికారులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. భక్తులందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.

లాల్ దర్వాజ బోనాలకు సర్వం సిద్ధం చేశాం. అర్ధరాత్రి బలిగంప కార్యక్రమంతో బోనాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి లాల్ దర్వాజ బోనాలకు భక్తులు తరలివస్తారు. ఆగస్టు 2న రంగంతో పాటు అంబారీ ఊరేగింపు కూడా ఉంటుంది. భద్రత దృష్ట్యా పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశాం. వాహనాలను దారి మళ్లిస్తాం. భక్తులు పోలీసులకు సహకరించాలి. బోనాల ఉత్సవాలు సజావుగా సాగేలా చూడాలి.

-అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ

ఇవీ చదవండి:

Last Updated : Aug 1, 2021, 5:10 AM IST

ABOUT THE AUTHOR

...view details