స్వాతంత్య్రదినోత్సవ వేడుకలకు రాష్ట్రం ముస్తాబైంది. ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చారిత్రక గోల్కొండ కోట వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం కోటను ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో గోల్కొండ కాంతులీనుతోంది.
సీఎం షెడ్యూల్
ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక కట్టడాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. సికింద్రాబాద్ కవాతు మైదానం వద్ద ఉన్న వీరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం సందర్శిస్తారు. సైనిక అమరవీరులకు సీఎం అంజలి ఘటిస్తారు. అనంతరం గోల్కొండ కోటకు బయల్దేరి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
కోటలో త్రివర్ణ పతాకం
కోటలోని రాణీమహల్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. గోల్కొండ కోట వేదిక నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, విజయాలను వివరించనున్న సీఎం... దళితబంధు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ తదితర కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా గోల్కొండ కోటపై వివిధ కళారూపాలను ప్రదర్శించనున్నారు.