తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్నిపథ్‌ సెగ.. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ మూసివేత - అగ్నిపథ్ అల్లర్లు వార్తలు

Alert at railway stations: అగ్నిపథ్​ నిరసనల నేపథ్యంలో ఏపీలోని పలు రైల్వేస్టేషన్లలో అధికారులు భద్రతను పెంచారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గుంటూరు, విశాఖ రైల్వే స్టేషన్లలో.. భారీగా పోలీసులు మొహరించారు. పలు రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపివేశారు.

vishaka
vishaka

By

Published : Jun 18, 2022, 9:22 AM IST

Alert at Railway stations: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ఆందోళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. దాడులు జరగవచ్చన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. అన్ని రైల్వే స్టేషన్​లలో అదనపు బలగాలను మోహరించారు.

విజయవాడ రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లో.. అధికారులు భద్రత పెంచారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్‌కు అదనంగా 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్టేషన్‌లోకి టికెట్లు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టిన అధికారులు.. స్టేషన్ ోలని అన్ని గేట్ల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలతో.. ప్రయాణికులను పరిశీలిస్తున్నారు.

యువకులు, విద్యార్థులు ఆందోళనకు దిగొద్దని సీపీ కాంతి రాణా టాటా సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతపై కేసు నమోదైతే ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని అన్నారు.

గుంటూరు రైల్వేస్టేషన్‌లోనూ భారీగా పోలీసులను మోహరించారు. చలో గుంటూరు కార్యక్రమం జరుగుతుందనే నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు.. ఆర్మీ నియామక బోర్డు వద్ద భద్రతను పెంచారు. ఆర్మీ కార్యాలయానికి వెళ్లే దారిని మూసివేశారు. రైల్వే స్టేషన్‌కు వచ్చిన అనుమానితులను ప్రశ్నిస్తున్న పోలీసులు.. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్వ వేక్షిస్తున్నారు. కొత్తపేట స్టేషన్‌కు ఆందోళనకు వస్తున్నారన్న సమాచారంతో పలువురు ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు.

రైల్వే స్టేషన్‌లో భద్రతను.. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఏఎస్పీ అనిల్‌కుమార్ పరిశీలించి.. సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. ఎవరైనా అభ్యర్థులు శాంతియుతంగా అభిప్రాయాలను చెప్పాలని.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే 200 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

విశాఖపట్నంలో రైల్వేస్టేషన్​ను మధ్యాహ్నం 12 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్‌లోకి ఎవ్వరికీ అనుమతి లేదన్న అధికారులు.. విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ దువ్వాడ వద్ద నిలిపివేయగా.. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. హవ్‌డా, విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ కొత్తవలస వద్ద నిలిపివేసి.. దారి మళ్లిస్తున్నారు. విశాఖ స్టేషన్‌కు రైళ్లు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

రైల్వేస్టేషన్‌కు అర కిలోమీటర్‌ ముందే అన్నివైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల వరకు ఉన్న ప్రయాణికులకే తనిఖీల అనంతరం అనుమతిచ్చారు. స్టేషన్‌ రోడ్డులోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అధికారి కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. భద్రత వ్యవహారాలను పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ స్వయంగా పరిశీలిస్తున్నారు. విశాఖలో పలువురు విద్యార్థి సంఘాల నేతలను గృహనిర్బంధం చేశారు. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్​ను సైతం.. అదుపులోకి తీసుకున్నారు.

రైల్వే స్టేషన్​ వద్ద ఉన్నతాధికారులు ఆకస్మిక తనీఖీలు చేపట్టారు. స్టేషన్ వద్ద అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. స్టేషన్‌కు ఎలా చేరుకోవాలో వాట్సాప్‌ సందేశాలు ఇస్తున్నట్లు గుర్తించారు.

కంచరపాలెం గేట్, మర్రిపాలెం హాల్ట్, సింహాచలం స్టేషన్ల వద్ద.. అధికారులు భద్రత పెంచారు. మద్దిలపాలెం, జ్ఞానాపురం ప్రాంతాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రైల్వే కల్యాణమండపం జంక్షన్ వద్ద వాహనాల మళ్లింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. రైల్వేస్టేషన్‌కు దూరంగా.. బస్సులు ఆపివేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. లగేజీతో ఎక్కువ దూరం నడవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నిరుద్యోగులు, ప్రజలు ఎలాంటి ఆందోళనలకు దిగొద్దు.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు.. విధ్వంసాలకు పాల్పడితే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్టు ప్రకారం చర్యలు.. కార్యాలయాల ఆస్తుల పరిరక్షణకు అన్నిరకాల చర్యలు చేపట్టాం: సీపీ శ్రీకాంత్‌

విజయవాడ రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లలో భద్రత భారీగా పెంచారు. ప్రత్యేక బలగాలతో ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

యువకులు, విద్యార్థులెవరూ ఆందోళనకు దిగొద్దు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. కేసు నమోదైతే యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని.. జాగ్రత్తగా ఉండాలి: సీపీ కాంతి రాణా టాటా

విజయవాడలో అగ్నిపథ్‌ రద్దు చేయాలంటూ ఆందోళన చేసిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్​ చేశారు. వారిని అర్ధరాత్రి ఒంటిగంటకు ఇబ్రహీంపట్నం, కంచికచర్ల పీఎస్‌లకు తరలించారు. విద్యార్థి నాయకుల అరెస్టుపై ప్రశ్నించిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

విశాఖ రాకుండా దువ్వాడ నుంచి దారి మళ్లించిన రైళ్లు..

  • సంత్రాగచ్చి-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌(22807) మళ్లింపు
  • చెన్నై సెంట్రల్‌-హావ్‌డా మెయిల్‌(12840) మళ్లింపు
  • ధన్‌బాద్‌-అలెప్పీ బొకారో(13351) మళ్లింపు
  • వాస్కోడగామా-హావ్‌డా(18048) మళ్లింపు
  • టాటా-యశ్వంత్‌పూర్‌ వీక్లీ (12889) మళ్లింపు
  • గుంటూరు-రాయగఢ (17243) మళ్లింపు
  • తిరుచిరాపల్లి-హావ్‌డా వీక్లీ(12664) మళ్లింపు
  • బెంగళూరు-భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌(18464)

దువ్వాడ వద్ద నిలిపివేయనున్న రైళ్లు..

  • విశాఖ-గోదావరి ఎక్స్‌ప్రెస్‌(12728)
  • కాచిగూడ-విశాఖ(12862) ఎక్స్‌ప్రెస్‌
  • సికింద్రాబాద్‌-విశాఖ గరీబ్‌రథ్‌ (12740) ఎక్స్‌ప్రెస్‌
  • లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌-విశాఖ(18520)
  • కడప-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్‌(17487‌)

కొత్తవలస వద్ద నిలిపివేయనున్న రైళ్లు..

  • కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌(18517)
  • దిఘా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌(22873)

అనకాపల్లి వద్ద నిలిపివేయనున్న రైళ్లు..

  • మచిలీపట్నం-విశాఖ (17219)
  • కాకినాడ-విశాఖ(17267‌‌)
  • తిరుపతి-విశాఖ డబుల్‌ డెక్కర్‌(22708)

పార్వతీపురంలో నిలిపివేసిన రైళ్లు..

  • పార్వతీపురంలో బొకారో ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత
  • బెలగాం స్టేషన్‌లో కొరాపుట్‌-విశాఖ ప్యాసింజర్‌ నిలిపివేత
  • బొబ్బిలి స్టేషన్‌లో హతియా ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత
  • గొట్లాంలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details