కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కరోనా కట్టడి కోసం ఉపయోగపడుతున్న ఈ శానిటైజర్లు.. కొందరు మందుబాబులకు మాత్రం మద్యానికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. మద్యంతో పోలిస్తే చవకగా దొరుకుతుండటంతో శానిటైజర్లను మత్తు కోసం వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంలో చాలా చోట్ల బహిరంగ ప్రదేశాల్లోనే శానిటైజర్లు తాగుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఛీప్ లిక్కర్ ధరల్ని తగ్గించినా.. శానిటైజర్లతో పోలిస్తే మద్యం ధర ఎక్కువగా ఉంది. అందుకే కూలీలు, చెత్త పేపర్లు ఏరుకునేవాళ్లు, బిచ్చగాళ్లు మత్తు కోసం శానిటైజర్లపై ఆధారపడుతున్నారు.
70 నుంచి 80శాతం...
సాధారణంగా బీరులో తొమ్మిది శాతం, మద్యంలో సుమారు 24.3 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అదే శానిటైజర్‌లో అయితే 70 నుంచి 80శాతం వరకూ ఆల్కహాల్ ఉంటుంది. శానిటైజర్ల తయారీకి వాడే ఆల్కహాల్ ఎంతో ప్రమాదకరం. ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో శానిటైజర్లు తాగి కొందరు మరణించారు కూడా. శానిటైజర్ తయారీలో వాడే ఐసో ప్రొపైల్ ఆల్కహాల్ తాగేందుకు పనికిరాదు. సరైన ప్రాసెసింగ్ లేని ఈ ఆల్కహాల్ తాగితే నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతినడంతో పాటు ప్రాణాలకూ ముప్పుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.