హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సందడి పెరుగుతోంది. కొవిడ్ సెకండ్ వేవ్ నుంచి కోలుకున్న తర్వాత క్రమంగా రద్దీ పెరుగుతుంది. ప్రయాణికుల రక్షణ కోసం జీఎంఆర్... సురక్షిత ప్రయాణ వాతావరణాన్ని కల్పిస్తోంది. దేశంలోని అన్ని నగరాలకు విమాన ప్రయాణాల సంఖ్య పెరిగింది. జూన్ 1 నుంచి 30 తేదీల మధ్య విమానాశ్రయం నుంచి 4 లక్షల మందికి పైగా దేశీయ ప్రయాణికులు, సుమారు 35 వేల మంది విదేశాలకు ప్రయాణించారు. కొవిడ్ నిబంధనల అమలుకు విమానాశ్రయ అధికారులు సర్వైలెన్స్ బృందాల సహాకారంతో రాష్ట్ర పోలీసులకు సహాయం చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘించినవారికి జరిమానాలు విధిస్తున్నారు. కొవిడ్ భద్రతా మార్గదర్శకాలను అమలు చేయడానికి జీఎంఆర్ లిమిటెడ్ 20 మంది అధికారులను, ప్రత్యేక పోలీసు అధికారులు ఎస్పీవోలను నియమించింది.
నిబంధనలు పాటించకపోతే జరిమానా..
విమానాశ్రయంలో కొవిడ్ మార్గదర్శకాలను పాటించని ప్రయాణికులు, సందర్శకులు, సిబ్బందికి జరిమానా విధించే అధికారం వీరికి ఉంటుంది. టెర్మినల్లో ప్రయాణికులు, సిబ్బంది మాస్కులు సరిగ్గా ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కోరుతూ నిరంతరం ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కొవిడ్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో సైనేజ్లను ప్రదర్శిస్తున్నారు.