తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో విమాన సేవలు పుంజుకుటున్నాయ్..! - జీఎమ్మార్​ ఎయిర్​పోర్టు

కరోనా ప్రభావంతో స్తంభించిన విమానయాన సేవలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఇప్పటికే డొమెస్టిక్‌ విమానాల రాకపోకలు 93శాతం తిరిగి ప్రారంభం కాగా.. శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమాన సేవలు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. దుబాయ్, షార్జా, యుకేలకు వారానికి మూడు రోజులు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగుతుండగా మరికొన్ని విదేశీ సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.

airlines services increased in shamshabad airport
భాగ్యనగరంలో విమాన సేవలు పుంజుకుటున్నాయ్..!

By

Published : Sep 14, 2020, 8:05 PM IST

కొవిడ్‌ వ్యాప్తిని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్‌ విధించగా.. మార్చి చివరి వారంలో నిలిచిపోయిన విమాన సర్వీసుల సేవలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలను పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు అనువుగా పరిస్థితులను తీర్చిదిద్దారు.

అంతా శానిటైజ్​ చేస్తున్నారు..

ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు తాకే ప్రదేశాలు, లగేజి కోసం ఉపయోగించే ట్రాలీలు తరచూ శానిటైజ్‌ చేస్తున్నారు. శానిటైజ్‌ చేసుకోడానికి సెన్సార్‌ శానిటైజ్​ పరికరాల నుంచి.. కుళాయిలు, ఇతర పరికరాలన్నింటికీ సెన్సార్లు అమర్చారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ రూపొందించిన నిబంధనల మేరకు విమానాశ్రయాల్లో అన్ని రకాల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

శంషాబాద్‌ ఎయిర్​పోర్టులో జీఎంఆర్‌ యాజమాన్యం అన్ని రకాల ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎయిర్‌ పోర్టు పూర్తిగా ఈ-బోర్డింగ్ సౌలభ్యం కలిగిన విమానాశ్రయం కాబట్టి.. ఇక్కడ సెల్ఫ్ చెక్​-ఇన్ కియోస్క్​లు, టెక్-ఎనేబుల్డ్ ఎంట్రీ గేట్స్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, వర్చువల్ ఇన్ఫర్మేషన్ డెస్క్, ప్రి-ఎంబార్గేషన్, సెక్యూరిటీ స్క్రీనింగ్ జోన్‌ల వద్ద ఆటోమేటిక్ ట్రే రిట్రివల్ సిస్టమ్స్, యూవీ ఎనేబుల్డ్ డిస్‌ఇన్ఫెక్షన్, రిటైల్ అవుట్‌లెట్లలో యూవీ ఓవెన్, టచ్​లెస్ తాగునీటి ఫౌంటైన్లు లాంటి ఎన్నో సౌకర్యాలు కల్పించారు. విమానాశ్రయంలోకి ప్రవేశించినప్పటి నుంచి విమానంలో ఎక్కేవరకు, విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విమానం నుంచి దిగి ఎయిర్‌పోర్టు బయటకు వచ్చే వరకు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రతి కౌంటర్‌ వద్ద ప్రత్యేక మార్కులు వేశారు. ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న వందేభారత్‌ మిషన్‌ విమాన సర్వీసులు లాక్‌డౌన్‌లో కూడా తిరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. స్వదేశీ విమాన సర్వీసులు మే 25 నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.

సేవల్లో 200 విమానాలు..

ఈ క్రమంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శంషాబాద్‌ ఎయిర్​పోర్టు నుంచి స్వదేశి విమానాల రాకపోకలను మే 25న తిరిగి పునరుద్ధరించిన సమయంలో ప్రయాణికుల సంఖ్య రోజుకు మూడు వేలకు మించలేదు. అయితే.. ఇప్పుడు ఆ సంఖ్య ఇరవైవేలకు చేరింది. మొదట్లో కేవలం 40విమానాలు రాకపోకలు సాగించగా.. ఇప్పుడు దాదాపు 200 విమానాలు సేవల్లో ఉన్నాయి. ప్రతిరోజు దేశంలోని 55 నగరాలకు విమానాల రాకపోకలు సాగించాల్సి ఉండగా ఇప్పటికి 93శాతం పునరుద్ధరించారు. ప్రస్తుతం 51 నగరాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయి. గత నెలలో నాగ్‌పూర్‌, మంగళూరు, కొజిక్కొడ్‌, జబల్​పూర్‌ నగరాలకు కొత్తగా విమానాల రాకపోకలు పునరుద్ధరించారు. హైదరాబాద్‌ నుంచి ఎక్కువగా దిల్లీ, కోల్‌కత్తా, చెన్నై, బెంగళూరు, ముంబైలకు ఎక్కువగా ప్రయాణిస్తున్నట్టు ఎయిర్​పోర్టు వర్గాలు వెల్లడించాయి. మొదటి వంద రోజుల్లో దాదాపు 14వేల ట్రిప్పులు విమానరాకపోకలు సాగి... 13లక్షలకుపైగా ప్రయాణికులు శంషాబాద్‌ జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్టు నుంచి దేశంలోని వివిధ నగరాలకు ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు.

నిబంధనలకు లోబడే..

మొదట స్వదేశీ విమాన రాకపోకలకే పరిమితం కాగా... క్రమక్రమంగా అంతర్జాతీయ విమానసర్వీసులను పునరుద్ధరించే దిశలో డీజీసీఎ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఐటీ హబ్‌గా, ఫార్మా రంగానికి కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్‌ నుంచి కూడా విదేశాలకు రాకపోకలు మొదలయ్యాయి. శంషాబాద్‌ జీఎంఆర్‌ ఎయిర్​పోర్టు నుంచి ఇతర దేశాలకు రాకపోకలు సాగించేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇతర దేశాలకు విమానాల రాకపోకల పునరుద్ధరణ తప్పనిసరైంది. సెప్టెంబరు నెల 17వ తేదీన హైదరాబాద్‌ నుంచి లండన్‌కు బ్రిటిష్‌ ఎయిర్​వేస్‌ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్​ 10న దుబాయి, షార్జా,ఎమిరేట్స్‌, ఫ్లై దుబాయి‌, ఎయిర్‌ అరేబియా విమాన సేవలు మొదలయ్యాయి. హైదరాబాద్ నుంచి దుబాయికి వెళ్లడానికి, తిరిగి రావడానికి ఎమిరేట్స్ లేదా ఫ్లై దుబాయి విమాన సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. షార్జా హైదరాబాద్‌ల మధ్య ప్రయాణించాలనుకున్న వారు ఎయిర్ అరేబియా సేవలను ఉపయోగించుకోవచ్చని ఎయిర్‌ పోర్టు అధికారులు తెలిపారు. ఎమిరేట్స్, ఫ్లై దుబాయి సర్వీసులు హైదరాబాద్ దుబాయిల మధ్య వారానికి మూడు రోజులు తిరుగుతాయి. ఎమిరేట్స్ మంగళ, గురు, ఆదివారాలలో.. ఫ్లై దుబాయి సోమ, బుధ, శనివారాలలో సర్వీసులను అందిస్తున్నాయి. ఎయిర్ అరేబియా కూడా హైదరాబాద్, షార్జాల మధ్య వారానికి మూడు రోజులు బుధ, శుక్ర, ఆదివారాలలో సర్వీసులను నడుపుతోంది. భారత ప్రభుత్వ హోం శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి దుబాయి, షార్జాలకు ఆయా ఎయిర్ లైన్స్ నుంచి తమ టికెట్టును బుక్ చేసుకోవచ్చని... కొవిడ్ మార్గదర్శకాలకు లోబడి ప్రయాణికులు ట్రావెల్​ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి హైదరాబాద్‌ నడుపుతున్న దాదాపు 600 విమానసర్వీసుల ద్వారా 80వేల మంది వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:యాదాద్రిలో కోతులకు అరటిపండ్లు అందించిన కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details