దీర్ఘకాలంగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న కుంతియాకు ముగింపు పలికిన కాంగ్రెస్... తమిళనాడుకు చెందిన ఎంపీ మానిక్కం ఠాగూర్‌ను సారథిగా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి కుంతియాను మార్చాలన్న డిమాండ్ హస్తం పార్టీలో తరచూ వినిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని, సకాలంలో అభ్యర్థుల ఎంపిక చేయకపోవడం వల్లనే పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో కొత్త సారథిపై విశ్వాసం ఉంచి పార్టీని మళ్లీ గెలుపు బాట పట్టించాలని అధిష్ఠానం సమాలోచనలు చేస్తోంది.
పరిస్థితులపై దృష్టి..
మానిక్కం ఠాగూర్ నియమితులైన వెంటనే రాష్ట్ర పరిస్థితులపై దృష్టిసారించారు. జూమ్ యాప్ ద్వారా 3 గంటలపాటు పార్టీ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సుదీర్ఘ సమావేశంలో పార్టీ స్థితిగతులు, అధికార పార్టీ దూకుడుతో పాటు ఇతర పార్టీల గురించి ఠాగూర్ ఆరా తీశారు. జరగబోయే జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికలతోపాటు... దుబ్బాక ఉపఎన్నిక... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరు కలిసికట్టుగా పనిచేయాలని మానిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు.