AIMIM Party Candidates List : తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఎంఐఎం(AIMIM) పార్టీ 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. (AIMIM MLA Candidates) చంద్రాయణ గుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, నాంపల్లి నుంచి మాజీద్ హుస్సేన్, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, యాకత్పురా నుంచి జాఫర్ హుస్సేన్ మిరాజ్ పోటీ చేయనున్నారు. మలక్‌పేట నుంచి అహ్మద్ బలాల, కార్వాన్ నుంచి కౌసర్ మొయినుద్దీన్ పోటీ చేస్తారని తెలిపారు. బహదూర్‌పూరా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఒకటి రెండు రోజల్లో ప్రచారం ప్రారంభిస్తామనిఅసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మల్యేలైనా పాషా ఖాద్రీ, ముంతాజ్ హేమంత్ ఖాన్ ఈసారి ఎన్నికల బరిలో నిలబడటం లేదని తెలిపారు. తాము పోటీ చేయబోయే ప్రతి స్థానంలో గెలుస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు.
సంఖ్య | నియోజకవర్గం | అభ్యర్థి |
1 | చంద్రాయణ గుట్ట | అక్బరుద్దీన్ ఓవైసీ |
2 | నాంపల్లి | మాజీద్ హుస్సేన్ |
3 | చార్మినార్ | జుల్ఫికర్ |
4 | యాకత్పురా | జాఫర్ హుస్సేన్ మిరాజ్ |
5 | మలక్‌పేట | అహ్మద్ బలాల |
6 | కార్వాన్ | కౌసర్ మొయినుద్దీన్ |
'బీజేపీ, కాంగ్రెస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. తమవి లౌకిక పార్టీలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అబద్ధం చెబుతున్నారు. బాబ్రీ మసీదు విషయంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అందరికీ తెలుసు. బాబ్రీ మసీదు ఘటనలో ఒక్క కాంగ్రెస్ నేతకూ శిక్ష పడలేదు. రాహుల్‌గాంధీ (Rahul Gandhi) , కమలానాథ్.. నాటకాలు ఆడుతున్నారు. భారత్ జోడో పేరుతో రాహుల్‌గాంధీ అబద్ధాలు చెబుతున్నారు. 60 ఏళ్లుగా దేశంలో, రాష్ట్రాల్లో పరిపాలన చేసింది కాంగ్రెస్ కాదా?'. అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.