నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ఆందోళన చేపట్టింది. ధర్నా చౌక్‌లో చేపట్టిన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతు సంఘాల ధర్నాలో తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు.. చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం పాల్గొని.. సంఘీభావం తెలిపారు.
తెలంగాణ రైతులూ పోరాటాలి..
స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలో ఇంత పెద్ద రైతన్నల ఉద్యమం జరగలేదని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. దేశ రాజకీయాలను శాసించే శక్తులను సవాల్ చేస్తూ రైతులు ఉద్యమిస్తున్నారని కొనియాడారు. తెలంగాణలోనూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని ప్రకటించిన తరువాత.. రాష్ట్ర రైతుల్లోనూ ఆందోళన మెదలైందన్నారు. పంజాబ్, హర్యానా రైతన్నల స్ఫూర్తితో.. తెలంగాణ రైతులు పోరాటం చేయాలని సూచించారు.
మద్దతు ధరకే గతిలేదు..
నరేంద్ర మోదీ ప్రభుత్వం నరహంతక పాలన సాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. దిల్లీ వేదికగా ఎముకలు కొరికే చలిలో రైతులు 35 రోజులుగా ఆందోళన చేస్తుంటే.. కేంద్రం పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు.. అన్నదాతలను బజారున పడేసే విధంగా ఉన్నాయన్నారు. ఈ చట్టాల్లో గిట్టుబాటు ధరలే కాదు కనీస మద్దతు ధరకే గతిలేకుండా పోయిందని విమర్శించారు.
నిఘా విభాగం ఏంచేస్తోంది...
వ్యవసాయ చట్టాలను రద్దుచేసే వరకు పోరాటం ఆగదనే సంకేతాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇచ్చేలా ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. రైతుల ఉద్యమం వెనకాల రాజకీయ పక్షాలు, ఉగ్రవాదులు, మావోయిస్టులు ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారందరూ ఉంటే నిఘా విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో దేశప్రజల ఆహారభద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
'భారతదేశంలో ఇంత పెద్ద రైతన్నల ఉద్యమం జరగలేదు' ఇవీచూడండి:రైతుల సంఘాల నేతలతో కేంద్రం చర్చలు