హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ-ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో అఖిల పక్ష రైతు సంఘాలు ఆందోళన జరిపారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన వేళ.. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టాయి. దేశవ్యాప్త ఆందోళన పిలుపులో భాగంగా ఆ మూడు వ్యవసాయ ఆర్డినెన్సులు, విద్యుత్తు బిల్లు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్పోరేట్లను తరిమికొడదాం... రైతులను కాపాడుదాం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
వ్యవసాయ ఆర్డినెన్సులు రద్దు చేయాలని ఆందోళన - రైతు సంఘాల నేతలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక మూడు ఆర్డినెన్సులు రద్దు చేయాలని అఖిలపక్ష రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పంటల కొనుగోళ్లకు స్వేచ్ఛా వాణిజ్యం, కంపెనీలకు కార్పొరేట్ వ్యవసాయం, వ్యవసాయోత్పత్తుల నిల్వలపై పరిమితి విధించాలని కోరారు. వ్యవసాయదారులు, గృహ వినియోగదారులపై ఛార్జీల భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్లో అఖిల పక్ష రైతు సంఘాలు ఆందోళన నిర్వహించారు.
"రైతాంగం అప్పులు మొత్తం మాఫీ చేయాలి", "అన్ని పంటల ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి గిట్టుబాటు ధర ఇవ్వాలి" అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆర్డినెన్సులు దొడ్డిదారిన తీసుకొచ్చి వ్యవసాయాన్ని కార్పొరేట్ల పెత్తనానికి అప్పగించే పని చేస్తోందంటూ రైతు సంఘాల నేతలు ఆరోపించారు. దేశ రైతాంగాన్ని దెబ్బతీసి వ్యవసాయంను సాగనంపే కుట్ర మోదీ సర్కారు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అరోపించారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులు చిన్న సన్నకారు రైతులకు నష్టదాయకంగా పరిణమించబోతున్నాయని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ విస్సా కిరణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆ ఆర్డినెన్సులను రద్దు చేయాలని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు, తీగల సాగర్, వేములపల్లి వెంకటరామయ్య, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విస్సా కిరణ్ కుమార్, కన్వీనర్, రైతు స్వరాజ్య వేదిక గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే