సాగు చట్టాలు రద్దు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అఖిల భారత రైతు సమన్వయ కమిటీ పిలుపుతో హైదరాబాద్ తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గర అంబేడ్కర్ విగ్రహం వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నాయకులు ఆందోళనకు దిగారు. రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, ఈ చట్టాలు రద్దు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని ప్రతిజ్ఞలు చేశారు.
మద్దతు ధరల చట్టం కోసం పోరాడుతామంటూ రైతు సంఘాల నేతలు నినాదాలు చేశారు. ప్రైవేట్ మార్కెట్‌పై ప్రభుత్వ నియంత్రణలేని చట్టాలు రద్దు చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చేపట్టి నెల రోజులు దాటినప్పటికీ కేంద్రం ఇంకా సరిగా స్పందించడం ఆక్షేపించారు. ఇప్పటికే 35 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని... వీరిలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.