తెలంగాణ

telangana

ETV Bharat / state

AIG on Covid: 'ఆరునెలల తర్వాత కొవిడ్​ యాంటీబాడీలు తగ్గుతున్నాయి' - covid antibodies

AIG on Covid: కరోనా టీకా తీసుకున్న 30 శాతం మందిలో ఆరు నెలల తర్వాత కొవిడ్ యాంటీ బాడీలు తగ్గుతున్నాయని ఏఐజీ ఆస్పత్రి పేర్కొంది. హెల్త్ కేర్ వర్కర్లపై చేపట్టిన అధ్యయనంలో నిర్ధరణ అయినట్టు ప్రకటించింది.

AIG on Covid: 'వారిలో ఆరునెలల తర్వాత కొవిడ్​ యాంటీబాడీలు తగ్గుతున్నాయి'
AIG on Covid: 'వారిలో ఆరునెలల తర్వాత కొవిడ్​ యాంటీబాడీలు తగ్గుతున్నాయి'

By

Published : Jan 19, 2022, 5:59 PM IST

Updated : Jan 20, 2022, 6:51 AM IST

టీకా తీసుకున్న తర్వాత ఆరునెలల్లో 30 శాతం మందికి యాంటీబాడీలు తగ్గుతున్నట్లు తేలింది. ఐజీజీ యాంటీ-ఎస్‌1, ఐజీజీ యాంటీ-ఎస్‌2 యాంటీ బాడీల్లో గణనీయమైన మార్పు కన్పించినట్లు అధ్యయనంలో గుర్తించారు. 40 ఏళ్లు దాటి మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారిలో ఈ తగ్గుదల ఎక్కువగా కనిపిస్తోందని ఏషియన్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌తో కలిసి ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చేసిన అధ్యయనం తేల్చి చెప్పింది. వివరాలను బుధవారం ఏఐజీ ఆసుపత్రి వర్గాలు మీడియాకు విడుదల చేశాయి.

అధ్యయనం సాగిందిలా..

  • అధ్యయనంలో పాల్గొన్న 1636 మంది కార్యకర్తలు టీకా రెండు డోసులు తీసుకున్నారు. వీరిలో 93 శాతం మందికి కోవిషీల్డ్‌, 6.2 శాతం మందికి కోవాగ్జిన్‌ మరో 1 శాతం మందికి స్పుత్నిక్‌ టీకాలు అందించారు. ఆరు నెలల అనంతరం వీరిలో ఐజీజీ-ఎస్‌1, ఎస్‌2 యాంటీబాడీల స్థాయిలను అంచనా వేశారు.
  • ముఖ్యంగా 15 ఏయూ/ఎంఎల్‌ కంటే తక్కువ స్థాయిలో యాంటీబాడీలు ఉంటే అలాంటి వారిని యాంటీబాడీల నెగెటివ్‌గా పరిగణించారు. ఇలాంటి వారికి వైరస్‌ నుంచి ఎలాంటి రక్షణ ఉండదు. ఇక 100 ఏయూ/ఎంఎల్‌ స్థాయి కంటే ఎక్కువ యాంటీబాడీలుంటే అలాంటి వారికి వైరస్‌ నుంచి రక్షణ ఉన్నట్లే. అంతకంటే తగ్గితే మాత్రం వైరస్‌ ముప్పు ఉన్నట్లు తేల్చారు.
  • అధ్యయనానికి ఎంచుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో 30 శాతం మందిలో 100 ఏయూ/ఎంఎల్‌ కంటే తక్కువ స్థాయిలో యాంటీబాడీలున్నట్లు తేలింది. వీరంతా 40ఏళ్లు వయస్సు దాటినవారే. అంతేకాకుండా అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అనుబంధ రోగాలు ఉన్నవారిలో రెండు డోసులు తీసుకున్నా ఆరు నెలల తర్వాత యాంటీబాడీల తగ్గుదల కనిపిస్తోందని చెప్పడానికి ఈ అధ్యయనం నిదర్శనమని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఇది చాలా కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 40 ఏళ్లు పైబడి అధిక రక్తపోటు, మధుమేహం ఉంటే వారిలో కరోనా ఎక్కువ ప్రమాదకారిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘6 నెలలు దాటిన తర్వాత వీరంతా బూస్టర్‌ డోసు తీసుకోవడం ఉత్తమం. ఇక 70 శాతం మందిలో తగినంత యాంటీబాడీల స్థాయిలు ఉన్న నేపథ్యంలో 9 నెలల విరామం తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 20, 2022, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details