AICTE News: రాష్ట్రంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) షాక్ ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం(2022-23)లో 14 కళాశాలల్లోని మొత్తం సీట్లలో 10 శాతం కోత పెట్టింది. ఈ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లాలని ఆయా కళాశాలల యాజమాన్యాలు సిద్ధమైనట్లు సమాచారం.
ఎందుకిలా..
AICTE Updates : రాష్ట్రంలోని పలు ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలు బీ-కేటగిరీ సీట్ల భర్తీలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ రిజర్వేషన్లు పాటించడం లేదని, వాటిని వార్షిక ఫీజు కంటే 10 రెట్ల అధిక మొత్తానికి అమ్ముకుంటున్నాయని, పత్రికా ప్రకటన ఇవ్వడం లేదంటూ గత నవంబరులో కొందరు విద్యార్థులు జాతీయ బీసీ కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ సంఘం ఏఐసీటీఈతోపాటు రాష్ట్ర ఉన్నత విద్యామండలికి నోటీసులు జారీ చేసింది. డిసెంబరు 3న రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావుతోపాటు ఏఐసీటీఈ అధికారులు దిల్లీలో జాతీయ బీసీ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. యాజమాన్య కోటా మొదలైనప్పటి నుంచి రిజర్వేషన్ అమలులో లేదని, 2011లో జారీ చేసిన జీవో 74 ప్రకారం కేవలం కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే 70 శాతం సీట్లలోనే అమలులో ఉందని విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వివరణ ఇచ్చారు. ఈ అంశంపై ఏఐసీటీఈ నియమించిన కమిటీ సభ్యులు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి.. ఆయా కళాశాలలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపారు. యాజమాన్య కోటాలో చేరిన విద్యార్థుల వివరాలను పరిశీలించారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం బీటెక్ సీట్లు పొందాలంటే ఇంటర్‌లో 40 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. కానీ, 35 శాతం మార్కులు వచ్చిన వారికీ సీట్లు ఇచ్చారని కమిటీ సభ్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే వచ్చే విద్యా సంవత్సరంలో 10 శాతం సీట్లను తగ్గించాలని ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది.
అయితే కరోనా పరిస్థితుల్లో 35 శాతం మార్కులు వచ్చినా పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీటీఈ నిర్ణయం అమలవుతుందో లేదో వేచిచూడాల్సిందే.
ఇదీచూడండి:TS Schools to Reopen: ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం