తెలంగాణ

telangana

ETV Bharat / state

'2021-22 విద్యా సంవత్సరం కాలపట్టిక ఖరారు' - aicte academic calendar 2021

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌ ప్రథమ సంవత్సరం తరగతులను ఈ ఏడాది సెప్టెంబరు 15 లోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌ చదువుతున్న పాత విద్యార్థులకు సెప్టెంబరు 1 లోపు తరగతులు మొదలుపెట్టుకోవచ్చునని తెలిపింది. ఈ మేరకు విద్యా క్యాలెండర్‌ను ఖరారు చేసింది.

AICTE finalizes 2021-22 academic year, AICTE latest news
'2021-22 విద్యా సంవత్సరం కాలపట్టిక ఖరారు'

By

Published : May 7, 2021, 1:44 PM IST

Updated : May 7, 2021, 4:24 PM IST

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 2021-22కి సంబంధించి బీటెక్‌ ప్రథమ సంవత్సరం తరగతులను... ఈ ఏడాది సెప్టెంబరు 15 లోపు ప్రారంభించాలని ఏఐసీటీఈ ప్రకటించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో తరగతులను ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ లేదా రెండు విధాలుగానూ (బ్లెండెడ్‌) నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. కేంద్ర వైద్య-ఆరోగ్య శాఖ, కేంద్ర హోంశాఖల మార్గదర్శకాల మేరకు అవసరమైతే కాలపట్టికలో మార్పులు చేస్తామని కూడా పేర్కొంది.
వెల్లువెత్తుతున్న విమర్శలు
తాజా కాలపట్టికపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుండానే విద్యా క్యాలెండర్‌ను ప్రకటించి ఏఐసీటీఈ చేతులు దులుపుకుంటోందని విమర్శిస్తున్నారు. జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియకుండా రాష్ట్రాల్లో తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు. గత ఏడాది తెలంగాణలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చాలా సీట్లు మిగిలిపోయిన సంగతిని గుర్తుచేశారు. ‘‘క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా తేదీలను అటూఇటూ మారుస్తూ ఏదో ఒక కాలపట్టికను ఏఐసీటీఈ ఇస్తోంది. తర్వాత పలుమార్లు మళ్లీ గడువులను పెంచుతూ సవరణలు చేపడుతోంది. ఇది ఆ సంస్థకు అలవాటుగా మారింది’’ అని సాంకేతిక, వృత్తివిద్యా సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వి.బాలకృష్ణారెడ్డి విమర్శించారు. ‘‘తరగతులు జరుగుతున్నాయా? పరీక్షలు జరిగాయా? ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయా? అని ఏఐసీటీఈ ఏనాడూ పట్టించుకోలేదు. కాలపట్టికను మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది’’ అంటూ తెలంగాణ పాఠశాలలు, సాంకేతిక కళాశాలల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ కాలపట్టిక
జూన్‌ 30 లోపు: కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులు
జులై 15 లోపు: వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి
ఆగస్టు 31 లోపు: మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి
సెప్టెంబరు 1 లోపు: పాత విద్యార్థులకు తరగతులు ప్రారంభం
సెప్టెంబరు 9 లోపు: రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తి
సెప్టెంబరు 10 లోపు: సీట్ల రద్దుకు గడువు, రద్దు చేసుకున్నవారికి మొత్తం ఫీజు తిరిగి ఇవ్వాలి
సెప్టెంబరు 15 లోపు: ఖాళీల్లో చేరేందుకు తుది గడువు, మొదటి సంవత్సరానికి తరగతులు ప్రారంభం
సెప్టెంబరు 20 లోపు: రెండో ఏడాదిలోకి లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు

3-4 వాయిదాల్లో ఫీజులు తీసుకోండి
మొత్తం ఒకేసారి చెల్లించాలని విద్యార్థులను ఒత్తిడి చేయొద్దు

కరోనా సంక్షోభం నేపథ్యంలో.. ఒకేసారి మొత్తం ఫీజు చెల్లించాలంటూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేయొద్దని వృత్తివిద్యా కళాశాలల యాజమాన్యాలను ఏఐసీటీఈ ఆదేశించింది. 3-4 వాయిదాల్లో రుసుములు తీసుకోవాలని సూచించింది. ఆ విషయాన్ని కళాశాలలు తమ వెబ్‌సైట్లలో ఉంచాలని ఆజ్ఞాపించింది. విద్యార్థులకు హాజరు శాతం నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా పేర్కొంది. దగ్గరలోని కళాశాలలకు విద్యార్థులు వస్తే.. వారు ఏ కళాశాల వారని చూడకుండా అంతర్జాలం, వైఫై సౌకర్యం కల్పించాలని కోరింది. అధ్యాపకులు, ఇతర సిబ్బందికి వేతనాలను ప్రతినెలా పూర్తిగా చెల్లించాలని, వారిని విధుల్లో నుంచి తొలగించకూడదని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను విశ్వసించకుండా.. సమాచారం కోసం కేంద్ర విద్యాశాఖ, యూజీసీ, ఏఐసీటీఈ తదితర ప్రభుత్వ వెబ్‌సైట్లను మాత్రమే చూడాలని సూచించింది.

ఇదీ చూడండి: పడకలు కావాలన్నా, మృతదేహాలు తరలించాలన్నా రూ.వేలల్లో వసూలు

Last Updated : May 7, 2021, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details