తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించి రెండు రోజులు గడవకముందే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు.
బానిస బతుకు ఇష్టంలేకే కాంగ్రెస్‌కు రాజీనామా: దాసోజు శ్రవణ్ - congress latest issue
15:22 August 05
కాంగ్రెస్‌కు దాసోజు శ్రవణ్ గుడ్ బై
రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, బానిస బతుకు బతకడం ఇష్టంలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు దాసోజు శ్రవణ్ వెల్లడించారు. ఈమేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘సోనియా తెలంగాణ ఇచ్చారనే కృతజ్ఞతతో.. రాహుల్‌గాంధీ 2013లో జరిగిన జైపూర్ చింతన్ శిబిర్‌లో రాహుల్ ప్రసంగం విని ఉత్తేజితుడై 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరా. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీలో కులం, ధనం చూసి ప్రాధాన్యత ఇస్తున్నారు. రేవంత్ నాయకత్వలో అరాచక పరిస్థితులు నన్ను కలచివేశాయి’’ అని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో మాఫియా తరహా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇంతవరకు పార్టీ తరఫున సమీక్షలు గానీ, కమిటీలు గానీ పెట్టడం లేదు. పార్టీ అధికారంలోకి వస్తుందని ఏళ్లనుంచి ఎదురుచూస్తున్నాం. కాంగ్రెస్ కోసం పాటుపడిన మమ్మల్నే బలహీనపరుస్తున్నారు. పార్టీలోకి చేరింది బానిసగా బతకడానికి కాదు. ఎన్నో రోజులుగా బాధలు తట్టుకుంటూ వచ్చాను. కాంగ్రెస్‌ను రేవంత్‌రెడ్డి ప్రైవేట్ పాపర్టీగా మార్చుతున్నారు. కాంగ్రెస్ సభ్యత్వానికి... అన్ని రకాల పదవులకు రాజీనామా చేస్తున్నా.. - దాసోజు శ్రవణ్
గత కొంతకాలంగా పీసీసీ వైఖరి పట్ల శ్రవణ్ అసంతృప్తిగా ఉన్నారు. పీజేఆర్ కుమార్తె విజయరెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆయన అలిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తెలియగానే ఆ పార్టీ నేతలు కోదండరెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్ కలిసి దాసోజు ఇంటికి చేరుకున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవద్దంటూ బుజ్జగించారు. అయినా ఫలితం దక్కలేదు.