Dasoju sravan on Dharani: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల ప్రజలు పడుతున్న కష్టాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో చర్చించినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు. ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది యజమానులు రికార్డులు పట్టుకొని ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట తిరుగుతున్నారని విమర్శించారు. సర్వే చేసి రికార్డుల సవరణ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం అనాలోచితంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందని అన్నారు. ధరణి బాధితులకు మద్దతుగా వారం రోజుల పాటు భూ పరిరక్షణ ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు శ్రవణ్ తెలిపారు. మండల కేంద్రాల్లో భూ సమస్యలు ఎదుర్కొంటున్న ధరణి బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
congress on dharani:గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను ధరణి పేరుతో లాక్కున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ప్రాజెక్టుల కోసం లక్షల ఎకరాల భూమిని లాక్కొని, భూముల విలువ ఆధారంగా లెక్కలు కట్టలేదని, ఫలితంగా భూమి కోల్పోయిన బాధితులు నష్టపోయారని శ్రవణ్ వివరించారు. భూసేకరణ జరిగిన తరువాత ధరలు పెంచుతున్నామని చెప్పి, ప్రజల నోట్లో మన్ను కొట్టాలని తెరాస ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఖజానాను పెంచుకోవడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రుసుములను కూడా పెంచాలని చూస్తున్నారని విమర్శించారు. ధరణి బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అవసరమైతే ప్రధాని, రాష్ట్రపతిని కూడా కలుస్తామని శ్రవణ్ అన్నారు.