ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు జలదోపిడి, సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో తెరాస ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని తెరాస నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో విఫలమైతే.. ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
నిజంగా ప్రభుత్వానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం అడ్డుకోవాలని చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ సాగునీటి రంగానికి గొడ్డలిపెట్టు లాంటి ఈ పనులకు టెండర్లు దాఖలు చేసే ప్రతీ కాంట్రాక్టరుని తెలంగాణలో బ్లాక్ లిస్ట్ చేయడమెగాక... గతంలో కేటాయించిన పనులన్నీ రద్దు చేయాలని వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు.