తెలంగాణ

telangana

ETV Bharat / state

కలుపుకొని వెళ్లడం లేదా.. కలిసి రావడం లేదా?.. రేవంత్‌ను ప్రశ్నించిన అధిష్ఠానం - రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించిన ఏఐసీసీ

AICC questions Revanth Reddy leadership in Telangana: రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతంపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. పార్టీలో నేతల మధ్య సమన్వయం పెంచి.. అందరినీ కలుపుకుని.. వచ్చే ఎన్నికల్లోగా పుంజుకునేలా కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని దిల్లీకి పిలిపించుకుని హితబోధ చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయి నేతలు, ముఖ్యులకు సాధ్యమైనంత ఎక్కువగా అందుబాటులో ఉండాలని సూచించినట్లు సమాచారం.

AICC questioned Revanth Reddy leadership
congress high command questions revanth

By

Published : Nov 25, 2022, 8:15 AM IST

లోపం ఎక్కడుంది

AICC questions Revanth Reddy leadership in telangana: బలమైన పునాదులున్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతుండడంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఏఐసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత పరిస్థితులపై మల్లికార్జున్ ఖర్గే దృష్టి సారించారు. తెలంగాణలో 2018 శాసనసభ ఎన్నికల అనంతరం 5 ఉపఎన్నికలు జరిగితే ఒక్కదానిలోనూ విజయం సాధించలేకపోయింది. మూడు స్థానాల్లో ఏకంగా డిపాజిట్‌ కోల్పోయింది. వరుసగా నేతల రాజీనామాలు, బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటున్న భావన నెలకొనడంతో పరిస్థితిని చక్కదిద్దాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అధిష్ఠానం దిల్లీ పిలిపించింది.

మీరు కలుపుకొని వెళ్లడం లేదా? వారు కలిసి రావడం లేదా?: తొలుత రేవంత్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, రోహిత్ చౌదరి, నదీం జావెద్.. పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్య నేతలకు అందుబాటులోకి రావడంలేదని, పీసీసీ నుంచి సరైన సమాచారం ఉండడం లేదని ఏఐసీసీకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తీరుపై వివరణ అడిగినట్లు సమాచారం. మీరు కలుపుకొని వెళ్లడం లేదా? వారు కలిసి రావడం లేదా? లోపం ఎక్కడుంది?.. సమన్వయం ఎందుకు దెబ్బతింటోందనే దానిపై రేవంత్‌రెడ్డిని ఆరా తీసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కొందరు సీనియర్ల తీరుతో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను రేవంత్‌రెడ్డి ఏకరవు పెట్టినట్లు సమాచారం. అదే సమయంలో మీరు కొంత మారాలని, ముఖ్యులకు, నియోజకవర్గ స్థాయి నేతలకు సాధ్యమైనంత ఎక్కువగా అందుబాటులో ఉండాలని రేవంత్‌కు అధిష్ఠానం సూచించినట్లు తెలిసింది.

మునుగోడు ఉపఎన్నిక ఓటమికి కారణాలు ఏమిటి?: మునుగోడు ఉప ఎన్నికల్లో ముందుగానే అభ్యర్థిని ప్రకటించినా.. పెద్ద ఎత్తున నేతలను మోహరించినా కనీసం 30 వేల ఓట్లు రాకపోవడంపై చర్చ కొనసాగినట్లు తెలియవచ్చింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ ధన ప్రవాహం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క మాజీ మంత్రి మినహా.. మిగతా సీనియర్లు మనస్ఫూర్తిగా సహకరించని తీరుపై చర్చకు వచ్చినట్లు సమాచారం.

అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలతో మాట్లాడాలని, అందరినీ కలుపుకొని పోవాలని రేవంత్‌ రెడ్డికి సూచించినట్లు సమాచారం. పార్టీ వదిలే నేతల విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వాలని, నూతనంగా చేరికలపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిసింది. పీసీసీ కార్యవర్గం కూర్పు, డీసీసీ అధ్యక్షుల నియామకంపై సంస్థాగత మార్పులు చేర్పులు సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details