Alleti Maheshwar Reddy resigns to Congress : ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు, బీజేపీ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై బుధవారం రోజున స్పందించిన మహేశ్వర్‌రెడ్డి.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ అయిన తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అర్హత పీసీసీకి లేదన్నారు. సోషల్ మీడియాలో ఏదో వస్తే దానికి తానెలా బాధ్యత వహిస్తానని మండిపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే వద్దే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు నేడు దిల్లీ వెళ్లారు.
ఈ క్రమంలోనే మహేశ్వర్‌రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపించారు. తీవ్ర మనస్తాపంతో పార్టీని వీడుతున్నానన్న ఆయన.. ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 26 తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఇవాళ తనను ఎవరు ఆహ్వానించినా.. వారిని కలుస్తానని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఇంతలోనే ఇలా బీజేపీలో చేరారు.
''తీవ్ర మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశా. ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఉద్దేశం లేదు. ఈ నెల 26 తర్వాత పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటా. ఇవాళ నన్ను ఎవరు ఆహ్వానించినా వారిని కలుస్తా.'' - మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్
ఖర్గే అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నం..: దిల్లీలో ఉన్న మహేశ్వర్‌రెడ్డి రాజీనామాకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. ఖర్గేతో మాట్లాడి భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. అయితే ఖర్గేను కలిసే అవకాశం రాకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.