గ్రేటర్ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు కాంగ్రెస్ పరిమితం కావటంతో పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి నియామకం జరిగే వరకు తానే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతానని తెలిపారు. త్వరితగతిన కొత్త ఛీఫ్‌ను ఎన్నుకోవాలని రాజీనామా లేఖలో స్పష్టం చేసినట్లు చెప్పారు. ఉత్తమ్ రాజీనామాతో రాష్ట్ర కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ దృష్టి సారించింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసే నాయకుడికే పీసీసీ పీఠం దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతల పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 9న సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కొత్త పీసీసీని ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.