తెలంగాణ

telangana

ETV Bharat / state

నేతలతో కొత్త ఇంఛార్జ్‌ వరుస భేటీలు.. కాంగ్రెస్‌ ఇకనైనా గాడినపడేనా!‌ - మాణిక్​రావు ఠాక్రే హైదరాబాద్​ 2రోజుల పర్యటన

AICC Incharge Manikrao Thakre : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని నేతలకు నూతన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మానిక్‌రావ్‌ ఠాక్రే దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమితులైన తర్వాత తొలిసారి హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. ఏఐసీసీ ఇంఛార్జ్‌ కార్యదర్శులతో సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టిలతో పాటు 24 మంది నేతలతో వేర్వేరుగా సమావేశమై రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి, బలోపేతంపై చర్చించారు.

AICC Incharge Manikrao Thakre
AICC Incharge Manikrao Thakre

By

Published : Jan 11, 2023, 7:56 PM IST

AICC Incharge Manikrao Thakre : వరుస అపజయాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, మరికొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికల పోరు నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం మణిక్కం ఠాగుర్‌ స్థానంలో మహారాష్ట్రకు చెందిన మానిక్‌రావు ఠాక్రేకు బాధ్యతలు అప్పజెప్పింది. తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఘనస్వాగతం పలికారు.

రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న మానిక్‌రావ్‌ ఠాక్రే... తొలిరోజు నేతలతో వరుస భేటీలతో తీరికలేకుండా గడిపారు. తొలుత రాష్ట్ర ఇంఛార్జ్‌ ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్‌ జావిద్‌, రోహిత్‌ చౌదరీలతో గంటపాటు సమావేశమైన ఆయన... రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ స్థితిగతులు, నాయకుల తీరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో విడివిడిగా సమావేశమయ్యారు.

వీరిద్దరి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ స్థితిగతుల గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత గీతారెడ్డి, మధుయాస్కీ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, జానారెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్‌ అలీ, హనుమంతరావు, మహేశ్వర్‌రెడ్డి సహా మరికొందరు నేతలతో సమావేశమయ్యారు. పలువురు నాయకులు ఠాక్రేతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సాయంత్రం వరకు నాయకులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించిన ఠాక్రే... సీనియర్‌ ఉపాధ్యక్షులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతోనూ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన 24 మంది నాయకులతో భేటీ కావాల్సి ఉండగా... కొందరు గైర్హాజరయ్యారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకుల మధ్య నెలకొన్న వివాదాలను పక్కన పెట్టి అందరూ ఏకతాటిపై నిలచి పార్టీ కోసం పని చేయాలని తనతో సమావేశమైన నాయకులకు మానిక్‌రావ్‌ ఠాక్రే స్పష్టం చేస్తున్నారు. పార్టీ నాయకులు మధ్య తలెత్తిన విభేదాలు ఏంటీ? వాటి పరిష్కరానికి తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర నాయకత్వం అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటని ఆరా తీసినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకోవడంతోపాటు పార్టీని బలోపేతానికి ఏయే కార్యక్రమాలు నిర్వహించాలని సలహాలు తీసుకుంటున్నారు.

మానిక్‌రావ్‌ ఠాక్రేతో భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డిని ఆహ్వానించినట్లు సమాచారం. ఆ ఇద్దరు నాయకుల్లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అందుబాటులో లేకపోగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఊర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర విమర్శలు చేసి షోకాజ్‌ నోటీసు అందుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం కానున్న ఠాక్రే... పార్టీ అనుబంధ కమిటీల ఛైర్మన్లతోనూ భేటీ కానున్నారు. గురువారం సాయంత్రం పార్టీకి చెందిన ఇతర నాయకులను కలిసేందుకు అవకాశం కల్పించినట్లు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details