కూరగాయలు, పండ్లు... అన్నింటిలో రసాయన అవశేషాలు ఉంటున్నతరుణంలో క్రమేణా సేంద్రియ ఉత్పత్తుల వైపు ప్రజలు అడుగులు వేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. టీఎస్ అగ్రోస్ సంస్థ ఆధ్వర్యంలో "తెలంగాణ సిరి" పేరిట అందుబాటులో ఉన్న కంపోస్ట్ సేంద్రియ ఎరువు రైతులు ఎక్కువగా వినియోగించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయం నుంచి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సేంద్రియ ఎరువుల (సిటీ కంపోస్ట్) వినియోగం పెంపుపై నిరంజన్ రెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.రాములు, రాంకీ వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థ ఎండీ గౌతం రెడ్డి, భవాని ఆర్గానిక్స్ ఎండీ రమేశ్ పాల్గొన్నారు.
సిటీ కంపోస్ట్ వినియోగంపై ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. రైతులకు ఈ ఎరువు ప్రాధాన్యత తెలిస్తే ఆదరణ లభిస్తుందని... ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సేంద్రియ ఎరువులకు ఇచ్చే 1500 రాయితీ అందేలా చూడాలన్నారు. అధిక కర్బన శాతం గల సేంద్రియ ఎరువు భూమికి ఎంతో అవసరమని... నేల ఆరోగ్యం గణనీయంగా పెంచుతుందని తెలిపారు.