ఆరుగాలం శ్రమించి పండించిన రైతుల వ్యవసాయ, ఉద్యానోత్పత్తులకు పొలం వద్దనే మద్దతు ధర కల్పించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పారిశ్రామిక విధానంలోని 14 అంశాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ యాంత్రీకరణ, పాలీహౌస్‌లు, సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహం అందించడం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడం వల్ల పంటల ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని వివరించారు.
వివిధ పంటలకు సంబంధించి నిజామాబాద్ జిల్లా నందిపేట, వేల్పూరులో పసుపు, పాలు, అపరాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉండగా... సత్తుపల్లి, జనగాం జిల్లా కల్లెంలో పండ్లు, కూరగాయలు.. సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్‌లో రైస్ మిల్లు, వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమని మంత్రి వెల్లడించారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో మామిడి, మొక్కజొన్నకు అనుకూలంగా ఉండగా... సిరిసిల్లలో పశువుల ఆహారం, జహీరాబాద్‌లో మాంసం, పాల ఉత్పత్తులు పరిశ్రమకు బాగుంటుందని మంత్రి తెలిపారు.