సాగు నీటి సౌకర్యంతో తెలంగాణ సాగు స్వరూపం మారిపోయిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. వనపర్తి, నాగర్ కర్నూలు, జోగుళాంబ గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి దేశంలోనే అత్యధికంగా వేరుశనగ దిగుబడి వస్తుందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వేరుశనగ పరిశోధనా కేంద్రం ఏర్పాటు కోసం రూ.50 కోట్ల మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు మంత్రి లేఖ రాశారు.
పీనట్ బట్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సాగు నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో తెగుళ్లు తట్టుకుని నిలబడే నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించడం.. ఎగుమతికి అవకాశం ఉండే వేరుశనగ పండించడానికి వనపర్తిలో ఒక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని లేఖలో పేర్కొన్నారు. ఆప్లాటాక్సిన్ లేని వేరుశనగకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. వేరుశనగ నుంచి ఉత్పత్తి చేసే పీనట్ బట్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని తెలిపారు.