తెలంగాణ

telangana

ETV Bharat / state

Niranjan Reddy: 'రైతులు సన్నరకం వరి సాగుకే మొగ్గు చూపాలి' - agriculture review

హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వానాకాలం పంటల సాగు, పురోగతి, వర్షపాతం, రసాయన ఎరువుల డిమాండ్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

Agriculture
మంత్రి నిరంజన్ రెడ్డి

By

Published : Jul 12, 2021, 10:45 PM IST

దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో దొడ్డు వరి వినియోగం తగ్గిపోయిన దృష్ట్యా రైతులు సన్న రకాలే సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి అధ్యక్షతన వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్​ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, అగ్రోస్ సంస్థ ఎండీ రాములు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ ఏడాది వానాకాలం పంటల సాగు, పురోగతి, వర్షపాతం, రసాయన ఎరువుల డిమాండ్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. దొడ్డు బియ్యం వినియోగించే తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు సాగును పెంచుకుంటున్నాయని ఈ సమావేశంలో ప్రస్తావన వచ్చింది. అధిక శాతం రాష్ట్రాల్లో దొడ్డు రకాల వినియోగం తగ్గిపోయిన తరుణంలో ధాన్యం కొనుగోళ్లను ఎఫ్‌సీఐ తగ్గించిందని మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. మార్కెట్ పరిస్థితిని గమనించి తెలంగాణ ప్రభుత్వం కొన్నాళ్లుగా సన్న వడ్ల సాగును పెంచాలని విజ్ఞప్తి చేస్తుందని వివరించారు.

సన్న వడ్ల సాగు...

ఇది గమనించి రైతులు సన్న వడ్ల సాగు పెంచాలని సూచించారు. అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు సన్న వడ్ల సాగు పెంచే దిశగా రైతులను చైతన్య పరచాలని ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో రైతులు పప్పు ధాన్యాలు, పత్తి, నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్‌ ఫాం సాగుతోపాటు, ఆలుగడ్డ సాగు, ఆలుగడ్డ విత్తనానికి ఉపయోగపడే విత్తనోత్పత్తిపై అధికారులు పరిశీలించి రైతులను ప్రోత్సహించాలని తెలిపారు.

కూరగాయల సాగు...

పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు కూరగాయల సాగు చేపట్టాలని స్పష్టం చేశారు. గత వేసవిలో టమాటా 6 వేల ఎకరాల్లో షేడ్‌నెట్‌లో సాగు చేయడం వల్ల రాష్ట్రంలో మార్కెట్ ధరలు అదుపులో ఉన్నాయని... ప్రభుత్వ సూచన పాటించి రైతులు సాగు చేయడం అభినందనీయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అన్ని రకాలు ఎరువుల నిల్వలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ... మోతాదుకు మించి రైతులు రసాయన ఎరువులు వాడొద్దని సూచించారు. గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని జులై, ఆగస్టు మాసాల్లో ఉండే ఎరువుల వినియోగం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నందున కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిని కలిసి కేటాయింపులు పెంచాలని కోరనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:KTR: 'ఎవరెన్ని మాట్లాడినా... పనిచేసే పార్టీకే ప్రజల పట్టం'

ABOUT THE AUTHOR

...view details