Niranjan Reddy Inaugurated Kisan Agri Show 2023: దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం కేంద్రం ప్రవేశపెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తాము ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ.. ఈ విషయాన్ని పెడచెవిన పెడుతోన్న కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌లో 3 రోజుల పాటు జరగనున్న కిసాన్ అగ్రి ప్రదర్శన-2023ని మంత్రి తన చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ విశ్రాంత ఛైర్మన్ డాక్టర్ గోవిందరాజులు చింతల, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో దేశం నలుమూలలకు చెందిన 150కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. యాంత్రీకరణ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో అత్యాధునిక వరి నాటు, కోత, నూర్పిడి యంత్రాలను మంత్రి తిలకించారు. పలు కొత్త యంత్రాలు, ట్రాక్టర్లను ప్రారంభించారు.
Kisan Agri Show 2023 in Hyderabad: రైతుల సౌకర్యార్థ్యం ఫాం సాథీ అంకుర సంస్థ ఆవిష్కరణ కలుపుతీసే రోబో టెక్నాలజీని ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. పలు స్టాళ్లు కలియతిరిగి పరిశీలించారు. వ్యవసాయ రంగం బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రాయితీలు ఇవ్వడం అంటే జాతి సంపద సృష్టించడమేనని అన్నారు.