యాసంగి పంటల ప్రణాళిక (Yasangi crop plan)పై తెరాస ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమీక్షించారు. వివిధ ప్రాంతాల్లో సాగుచేయాల్సిన పంటల విషయమై విస్తృతంగా చర్చించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్న అంశంతో పాటు సాగుచేయాల్సిన విస్తీర్ణం, మార్కెట్‌లో పంటల డిమాండ్ తదితర అంశాలపై ఆరా తీశారు.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్‌ను బట్టి మార్కెటింగ్ రీసెర్చ్, అనాలసిస్ వింగ్ సూచనలను పరిగణలోకి తీసుకోనున్నారు. అన్నింటి ఆధారంగా శుక్రవారం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తుది నివేదిక ఇవ్వనున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సీఎం కేసీఆర్ యాసంగి పంటల ప్రణాళికను ఖరారు చేయనున్నారు.
వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్న యాసంగి సీజన్ (yasangi season crops 2021)లో రైతులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాల సరఫరా సవాలుగా మారనుంది. ప్రస్తుత వానాకాలం సీజన్(Kharif season crops 2021)లో వరి 61.75 లక్షల ఎకరాల్లో వేశారు. దాన్ని కోసిన అనంతరం నవంబరు, డిసెంబరులో అంతే విస్తీర్ణంలో రెండో పంట వేయాలి. యాసంగిలో వరి వద్దని ప్రభుత్వం చెబుతున్నందున ప్రత్యామ్నాయంగా ఇతర పంటలకు విత్తనాలేం ఇస్తారు, వాటిపై రాయితీ ఉంటుందో లేదో అన్నదానిపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
విత్తనాల కొరత
- వరి సన్నరకాల వంగడాలే వేయాలని ప్రభుత్వం చెబుతున్నా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్ సీడ్స్) వద్ద విత్తనాలు లక్ష క్వింటాళ్లకు మించి లేవు. ప్రైవేటు కంపెనీల వద్ద పుష్కలంగా ఉన్నాయి. గతంలో క్వింటా వరి విత్తనాలపై రూ.1000 వరకూ రాయితీ ఇచ్చేవారు. ఈ యాసంగి(Rabi season crops 2021)లో వరి సాగు వద్దని ప్రభుత్వమే చెబుతున్నందున రాయితీపై విత్తనాలచ్చే అవకాశం ఉండకపోవచ్చు.
- వేరుసెనగ సాగు 4 లక్షల నుంచి 5 లక్షల ఎకరాలకు పెంచాలని అంచనా. ఇందుకు లక్ష క్వింటాళ్ల విత్తనాలు అవసరం. టీఎస్ సీడ్స్ వద్ద 10 వేల క్వింటాళ్లే ఉన్నాయి. బయట మార్కెట్‌లో వీటి ధరలు మండిపోతున్నాయి.
- శనగ విత్తనాలను గతంలో రాయితీపై ఇచ్చేవారు. ఈ సీజన్(Rabi season crops 2021)లో అది లేనందున బయటి మార్కెట్‌లోనే రైతులు కొనాలి. టీఎస్ సీడ్స్ వద్ద 50 వేల క్వింటాళ్లకు మించి లేవు. రాయితీపై ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. రైతులకు వెంటనే పంపిణీ చేసేందుకు.. ముందుగానే టీఎస్ సీడ్స్.. ప్రైవేటు కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించాలి.
- మొక్కజొన్న సాగును గతేడాది ప్రభుత్వం వద్దని చెప్పింది. ఈ యాసంగిలో వరి వద్దని చెబుతున్నందున మొక్కజొన్న వైపు రైతులు ఎక్కువగా వెళ్లే అవకాశాలున్నాయి. ఈ పంట సంకర జాతి విత్తనాలను ప్రైవేటు కంపెనీల నుంచే రైతులు కొనాలి. వ్యవసాయశాఖ వద్ద ఏమీ లేవు.
ఇదీ చదవండి:అక్టోబర్ 8న 'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్