తెలంగాణ

telangana

ETV Bharat / state

Land Market Values: మార్కెట్‌ విలువలు పెరిగినా... తగ్గని రిజిస్ట్రేషన్లు

Land Market Values: రాష్ట్రంలో మార్కెట్‌ విలువలు పెరిగినా.... వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల జోరు ఏమాత్రం తగ్గడంలేదు. రోజుకు సగటున మూడు వేలకు తగ్గకుండా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఎకరంపై అత్యధికంగా 3 లక్షలకుపైగా పెరగ్గా, అత్యల్పంగా యాభైవేలు పెరిగినట్లు స్టాంపులు... రిజిస్ట్రేషన్ల శాఖ వెల్లడించింది.

agriculture market values  increased in telangana
మార్కెట్‌ విలువలు పెరిగినా... తగ్గని రిజిస్ట్రేషన్లు

By

Published : Feb 10, 2022, 8:05 PM IST

Land Market Values: మార్కెట్‌ విలువలు పెరిగినా... తగ్గని రిజిస్ట్రేషన్లు

Land Market Values: రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.... భూముల విలువలు భారీగా పెరిగినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల బృందం అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, పర్యాటకం, మౌలిక వసతుల ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో రావడం, కొత్త జిల్లాల ఏర్పాటు.. ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీరు అందుబాటులోకి రావడం లాంటి కారణాలతో వ్యవసాయ భూముల విలువలు.... బహిరంగ మార్కెట్‌లో అంచనాకు మించి పెరిగినట్లు అధికారుల బృందం తేల్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ బేసిక్‌ విలువల కంటే ఎక్కువ ధరలకు రిజిస్ట్రేషనైన భూములు ఏకంగా 61.2శాతం ఉన్నట్లు తేల్చారు.

పెరిగిన వ్యవసాయ భూముల విలువలు

వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ గతంలో ఎకరాకు 75వేలు లేదా లక్ష రూపాయిలుగా ఉండేది. తాజాగా బేసిక్‌ రిజిస్ట్రేషన్ విలువపై యాభై శాతం పెంచినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ వెల్లడించింది. బహిరంగ మార్కెట్‌ విలువలు ఆధారంగా.... దాదాపు 700 గ్రామాలు ప్రాధాన్యత కలిగినవిగా గుర్తించి... ఇక్కడ యాభైశాతానికి మించి పెంచినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ స్పష్టం చేసింది. ఎకరా 5 కోట్లు నుంచి 10 కోట్ల రూపాయిల మధ్య విలువ కలిగిన ఉన్న భూముల మార్కెట్‌ విలువలు 20శాతానికి మించకుండా పెంచినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఎకరా 10కోట్లు అంతకంటే ఎక్కువ విలువ ఉన్నట్లయితే.... మార్కెట్‌ బేసిక్‌ విలువపై కేవలం పదిశాతం మాత్రమే పెంచినట్లు వెల్లడించింది.

గత వారంలో సుమారు 29 వేల రిజిస్ట్రేషన్లు

గత వారంలో.. ఐదు రోజుల్లోనే ఏకంగా 29 వేల రిజిస్ట్రేషన్లు అయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి, హుజూరాబాద్‌, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నల్‌, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లో గరిష్ఠంగా ఎకరా బేసిక్‌ మార్కెట్‌ విలువపై 3 లక్షల 75 వేలు పెరిగింది. ఎకరా మార్కెట్‌ విలువ గతంలో 7 లక్షల యాభై వేలుండగా ప్రస్తుతం 11 లక్షల 25వేలకు పెరిగింది. అదే విధంగా మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో ఎకరా మార్కెట్‌ విలువ ఆరు లక్షలుగా ఉండగా అది కాస్త తొమ్మిది లక్షలకు పెరిగింది. అత్యల్పంగా కుమరం బీం ఆసిఫాబాద్‌ జిల్లా సామెలలో ఎకరా లక్ష ఉండగా... అది లక్షన్నరకు మాత్రమే పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details