రైతుల ఆదాయం పెంచడం.. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటైన అగ్రి ఇన్నోవేషన్ హబ్‌కు ఏడాది పూర్తైన సందర్భంగా.. ఈ అగ్రి ఇన్నోవేషన్ ఫెస్ట్ నిర్వహించారు. ఏజీ హబ్, నాబార్డు ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో కొందరు యువత తాము తయారు చేసిన వ్యవసాయ పరికరాలు ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి.. యువతను అగ్రి బిజినెస్ మ్యాన్‌లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఏర్పాటైన పండుగలో వ్యవసాయ, గ్రామీణ ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. 26 వరకు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులోని అధిక రూపకల్పనలు చిన్న, సన్నకారు రైతులకు యోగ్యంగా ఉండటంతో వాటిని రూపొందించిన వారికి అభినందనలు లభించాయి.
డిప్లొమా పూర్తి చేసిన నాగస్వామి అన్నదాతల కోసం ఒక గ్రామీణ ఆవిష్కరణను పరిచయం చేశాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూరుకు చెందిన ఈ యువకుడు కూలీల సమస్య తీర్చడానికి బ్యాటరీతో నడిచే వరి నాటు యంత్రం రూపొందించాడు. ఆ యంత్రం తన వ్యవసాయ క్షేత్రంలో మంచి ఫలితాలు ఇచ్చిందంటున్న నాగస్వామి.. దాని పరితీరును ఇలా చెప్పుకొచ్చాడు.
సహకారం అందిస్తే మార్కెట్‌లోకి..: ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన సాయితేజ.. పంటపొలాల్లో రసాయన ఎరువుల పిచికారికి నూతన విధానం ఆవిష్కరించాడు. రూ.5 వేల కంటే తక్కువ ఖర్చుతో తయారైన ఈ ఆవిష్కరణకు ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు సహకారం అందిస్తే మార్కెట్‌లోకి తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
విత్తనాలు విత్తే "గొర్రు"..: వ్యవసాయదారైన తండ్రి.. కూలీల కోసం పడుతున్న కష్టాలు దగ్గరి నుంచి చూసిన సూర్యాపేట జిల్లా యువకుడు గొర్రెం అశోక్.. దానికో పరిష్కారం చూపాలనుకున్నాడు. వరిలో కలుపుతీత యంత్రం, పత్తి, మిరప విత్తనాలు విత్తే "గొర్రు" రూపొందించాడు. ఇది 4 రకాల పనులు చేసే ఏకచక్ర పరికరం. ఆవిష్కరణలే పెట్టుబడిగా దూసుకెళ్తున్న ఈ యువకుడు దీనికి ముందు వినికిడి శక్తి లోపించిన వ్యక్తుల కోసం స్మైల్ అలారం తయారు చేశాడు. తన ప్రతిభను గుర్తించి మంత్రి కేటీఆర్ కూడా అభినందించారు.