హైదరాబాద్ పార్క్ హయత్ హోటళ్లో రే కన్సల్టింగ్ ఆధ్వర్యంలో అగ్రి బిజినెస్ సమ్మిట్-2021 కార్యక్రమం జరిగింది. వ్యవసాయ రంగంలో రైతులకు ఎరువులు, సాంకేతిక, ఆవిష్కరణలపరంగా సేవలందిస్తున్న ఇఫ్కో ఎండీ డాక్టర్ యూఎస్ అవాస్థి, సల్ఫర్ మిల్స్ గ్రూపు అధినేత దీపక్ పి షాకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. సుస్థిర వ్యవసాయ వ్యాపారం బలోపేతంలో సహకార వ్యవస్థ మాడ్యూల్స్ అనే అంశంపై వక్తలు ప్రసంగించారు.
యూరియా బస్తాకు సమానమైన నానో లిక్విడ్ బాటిల్
దేశవ్యాప్తంగా ఇఫ్కో ఆధ్వర్యంలో కిసాన్ సంచార్, క్రాప్ సైన్స్, విత్తనోత్పత్తి, మార్కెటింగ్, అగ్రి ఇన్‌పుట్స్, ఈ-కామర్స్, కిసాన్ లాజిస్టిక్, శిక్షణ, అగ్రి ఫార్మింగ్ వంటి సేవలందిస్తున్నాయని అవాస్థి అన్నారు. ఒక యూరియా బస్తాతో సమానమైన నానో యూరియా లిక్విడ్ బాటిల్ ధర రూ. 240కే తీసుకొచ్చిన ఘనత ఇఫ్కోకే దక్కిందని, త్వరలో నానో డీఏపీ కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
త్వరలో మార్కెట్లోకి మిక్సింగ్ కెమికల్స్
మేక్ ఇన్ ఇండియా బ్రాండ్‌పై అమెరికా, చైనా, యూరప్, జపాన్, బ్రెజిల్ లాంటి 80 దేశాల్లో ఇన్నోవేషన్ ఇన్ అగ్రికల్చర్ సేవలందిస్తున్నామని సల్ఫర్ మిల్స్ గ్రూపు అధినేత దీపక్ పి షా అన్నారు. సంప్రదాయ ఫార్ములేషన్‌కు భిన్నంగా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా త్వరలో వాతావరణ మాడ్యుల్స్, మిక్సింగ్ కెమికల్స్ ప్రవేశపెట్టబోతున్నామని ఆయన ప్రకటించారు.
పెరిగిన ఉత్పత్తి, ఉత్పాదతక 3 రెట్లు
కీలక వ్యవసాయంలో అపారమైన అవకాశాలు ఉండటంతో కంపెనీలు, అంకుర కేంద్రాలు, రైతులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఏడేళ్లల్లో తెలంగాణ వ్యవసాయం, నీటి పారుదల రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరగడంతో ఉత్పత్తి, ఉత్పాదతక 2,3 రెట్లు పెరిగిందని, వచ్చే ఏడాది రాబోయే ఆహార శుద్ధి విధానం వల్ల చాలా మంది ఔత్సాహికపారిశ్రామికవేత్తలు ఈ రంగంలోకి దిగబోతున్నారని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు, ఐటీసీ లిమిటెడ్ అగ్రి విభాగం అధిపతి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Krishna Ella : ఎగుమతికి గిరాకీ ఉన్న పంటలే పండించాలి