KTR In Davos: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తొలిరోజు పలు ప్రసిద్ధ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన లులూ గ్రూపు రూ.500 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. స్పెయిన్‌కు చెందిన కీమోఫార్మా రూ.100 కోట్లతో తమ రెండో భారీ పరిశ్రమ ఏర్పాటును ప్రకటించింది. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్, బీమా సంస్థ స్వీస్‌రే హైదరాబాద్‌లో తమ కార్యాలయ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ-కామర్స్ సంస్థ మీషో కూడా రాష్ట్ర రాజధానిలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వాటిని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి వాణిజ్య సముదాయం: లులూ సంస్థ
మంత్రి కేటీఆర్‌ను లులూ సంస్థ అధిపతి యూసుఫ్‌అలీ కలిసి ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు నిర్ణయాన్ని తెలిపి, ప్రణాళిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అనుమతి పత్రాలను ఆయనకు అందజేశారు. మొదటి యూనిట్ పనులు చేపట్టిన వెంటనే రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేస్తామని ఈ సందర్భంగా యూసుఫ్‌అలీ తెలిపారు. తెలంగాణ నుంచి యూరప్ దేశాలకు శుద్ధిచేసిన ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో అద్భుత వాణిజ్య సముదాయం నిర్మిస్తామన్నారు.
* స్పానిష్ బహుళజాతి సంస్థ కీమోఫార్మా పరిశోధన అభివృద్ధి డైరెక్టర్ జీన్ డానియల్ బోనీ కేటీఆర్‌ను కలిసి రూ.100 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో రెండో ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. తమ సంస్థ 2018 నుంచి జీనోమ్ వ్యాలీలో రూ.170 కోట్ల పెట్టుబడితో.. 270 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు.
* 160 సంవత్సరాల చరిత్రగల స్విట్జర్లాండ్ బ్యాంకింగ్, ఆర్థిక నిర్వహణ, బీమా సంస్థ స్విస్ రే హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పింది. 250 మందికి ఉపాధి కల్పిస్తామని, దశలవారిగా విస్తరిస్తామని ప్రకటించింది. సంస్థ ఎండీ వెరోనికా స్కాట్టి, ప్రభుత్వ సంస్థల విభాగం డైరెక్టర్ ఇవో మెంజింగ్నర్ దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తమ నిర్ణయాన్ని తెలిపారు.హైదరాబాద్ కార్యాలయం ద్వారా తమ సంస్థ డాటా మరియు డిజిటల్ విభాగాలను బలోపేతం చేయడం, బీమా ఉత్పత్తులను రూపొందించడం, విపత్తుల నివారణ వంటి అంశాలపై పనిచేస్తుందన్నారు. నూతన ఆవిష్కరణల కోసం టీహబ్ భాగస్వామ్యం తీసుకుంటామన్నారు.