తొలి నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోందని, ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విమర్శించారు. కేంద్రంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని, దిల్లీలో రైతులకంటే పది రెట్లు ఎక్కువగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంటు పరిరక్షణ కోరుతూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బీసీ గేటు వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సభలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
పార్లమెంటులో సంఖ్యాబలం ఉందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సహించేది లేదని మంత్రి ముత్తంశెట్టి హెచ్చరించారు. ఉక్కు ఉద్యమం ఆపడం ఎవరితరం కాదన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ప్రయోజనం లేదని, జెండాలు పక్కనపెట్టి ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తే ఇక్కడి ఉద్యోగుల్లో సగం మంది ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కు భూముల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తే చేతులు కట్టుకోవాలా? అని ప్రశ్నించారు. తామంతా దిల్లీ వెళ్లి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఎంపీ సత్యవతి తెలిపారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, కార్మిక నాయకులు ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
కలసి రావాలంటూనే ఆంక్షలా?: తెదేపా
విశాఖ ఉక్కు పరిరక్షణకు పార్టీలకతీతంగా ముందుకు రావాలని వైకాపా నాయకులు ప్రకటిస్తూనే.. మరోవైపు పోలీసులతో ఆంక్షలు పెట్టిస్తూ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విశాఖ తూర్పు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. తెదేపా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. వివిధ నియోజకవర్గాల నుంచి తెదేపా శ్రేణులు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా అక్కడికి చేరుకున్నాయి. విశాఖ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించి ఆమోదింపజేసుకొని ఉద్యమంలోకి రావాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సూచించారు. ర్యాలీ నిర్వహిస్తామంటే కొవిడ్ నిబంధనలున్నాయని, పాదయాత్ర చేసుకోవాలంటూ ఎక్కడికక్కడ వాహనాలను ఆపి ఇబ్బంది పెట్టారని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒకవైపు కలిసి రావాలంటూనే అడ్డుకుంటూ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ధ్వజమెత్తారు.
మేధావుల ఆగ్రహం
కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమని మేధావులు, కార్మిక, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి జగ్గు నాయుడు అధ్యక్షతన వివిధ సంఘాల నాయకుల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు, నాగార్జున వర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య వి.బాలమోహన్‌దాసు, నన్నయ వర్సిటీ పూర్వ వీసీ ఆచార్య జార్జి విక్టర్, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, సెంచూరియన్ వర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎస్‌ఎన్ రాజు, కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు.
జగన్‌కు ప్రధాని ఓ లెక్క కాదు: అమర్‌నాథ్